
రష్యా చమురు దిగుమతి వివరాలు వెల్లడించలేం: సీఐసీ
రష్యా నుంచి భారతదేశం దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు వివరాలు అత్యంత గోప్యమైనవని, వాటిని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద బహిర్గతం చేయడం సాధ్యం కాదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) కూడా సమర్థించింది. ఈ వివరాలను వెల్లడిస్తే దేశ వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఇతర దేశాలతో ఉన్న సత్సంబంధాలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని కమిషన్ అభిప్రాయపడింది.
అసలేం జరిగింది?
జూన్ 2022 నుంచి జూన్ 2025 మధ్య కాలంలో రష్యా నుంచి భారత్‌కు ఎంత ముడి చమురు దిగుమతి అయ్యిందో తెలపాలని ఒక వ్యక్తి ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. కేవలం మొత్తం దిగుమతులే కాకుండా.. ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఓఎన్‌జీసీ విదేశ్, రిలయన్స్, నయారా ఎనర్జీ వంటి కంపెనీల వారీగా ఎంతెంత చమురు దిగుమతి చేసుకున్నారో విడివిడిగా వివరాలు కావాలని ఆయన కోరారు.
‘వాణిజ్య రహస్యాలు బహిర్గతం చేయలేం’
ఈ దరఖాస్తుపై పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ స్పందిస్తూ.. కంపెనీల వారీగా, దేశాల వారీగా ఇచ్చే సమాచారం వాణిజ్యపరమైన గోప్యతతో కూడుకున్నదని తెలిపింది. ఆర్టీఐ చట్టాల ప్రకారం ఇలాంటి వివరాలను వెల్లడించడం నుంచి మినహాయింపు ఉందని పేర్కొంది. అయితే దేశం మొత్తం మీద దిగుమతి చేసుకున్న చమురు పరిమాణం, దాని విలువ వంటి సాధారణ గణాంకాలు పీపీఏసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని సూచించింది.
దేశ ప్రయోజనాలే ముఖ్యం: సీఐసీ
ఈ కేసు విచారణ సందర్భంగా కేంద్ర సమాచార కమిషన్ కీలక వ్యాఖ్యలు చేసింది. "చమురు దిగుమతి గణాంకాలు కేవలం అంకెలు మాత్రమే కాదు, అవి అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలతో ముడిపడి ఉంటాయి. వీటిని వెల్లడిస్తే దేశ ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం కలగవచ్చు" అని పేర్కొంది. ఆర్టీఐ చట్టాల ప్రకారం దేశ భద్రత, వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచడం సరైనదేనని కమిషన్ స్పష్టం చేసింది.
అధికారికి షాక్.. పీపీఏసీకి ఆదేశాలు
సమాచార వెల్లడిలో మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని సమర్థించినప్పటికీ, విచారణా ప్రక్రియలో జరిగిన లోపాలపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు ఇచ్చినప్పటికీ విచారణకు హాజరుకానందుకు పీపీఏసీకి చెందిన సంబంధిత అధికారిపై కమిషన్ మండిపడింది. ఆర్టీఐ చట్టం ప్రకారం ఎందుకు జరిమానా విధించకూడదో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీ చేసింది.
ప్రభుత్వ సంస్థలు తమ వెబ్‌సైట్లలో సమాచారాన్ని సరిగ్గా ఉంచకపోవడంపై కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. సమాచార హక్కు చట్టం ప్రకారం.. ప్రజలు అడగకముందే సంస్థకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టాలని (దీనినే సుమోటో డిస్‌క్లోజర్ అంటారు) స్పష్టం చేసింది. పీపీఏసీ వెబ్‌సైట్‌లో ఖాళీగా ఉన్న ఆర్టీఐ విభాగాన్ని వెంటనే సరిచేసి, అవసరమైన సమాచారాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది.
పారదర్శకతతోనే నమ్మకం
ప్రభుత్వ ఆఫీసుల్లో పారదర్శకత పెంచేందుకు కమిషన్ కొన్ని కీలక సూచనలు చేసింది. ఆ సంస్థ ఏం పని చేస్తుంది? అక్కడ పని చేసే అధికారుల బాధ్యతలు ఏంటి? వారికి నెలకు ఎంత జీతం వస్తుంది? వంటి వివరాలను బహిరంగంగా వెల్లడించాలని కోరింది. ఇలాంటి వివరాలు ప్రజలకు తెలిస్తేనే ప్రభుత్వ పనితీరుపై వారికి స్పష్టత, నమ్మకం ఏర్పడతాయని సీఐసీ పేర్కొంది. ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు మరింత జవాబుదారీగా ఉండాలని ఈ సందర్భంగా కమిషన్ గుర్తుచేసింది.
