Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌లో రగ్బీ ప్రీమియర్ లీగ్

హైదరాబాద్‌లో రగ్బీ ప్రీమియర్ లీగ్

Shaik Mohammad Shaffee
28 ఏప్రిల్, 2026

భాగ్యనగరం మరో ప్రతిష్టాత్మక క్రీడా సమరానికి వేదిక కానుంది. దేశంలో రగ్బీ క్రీడను సరికొత్త పుంతలు తొక్కించేందుకు నిర్వహిస్తున్న ‘రగ్బీ ప్రీమియర్ లీగ్’ (ఆర్‌పీఎల్) రెండో సీజన్‌కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. ఈ ఏడాది జూన్ 16 నుంచి 28 వరకు గచ్చిబౌలి స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయని నిర్వాహకులు సోమవారం ప్రకటించారు. ముఖ్యంగా ఈ ఏడాది నుంచి మహిళల విభాగంలోనూ లీగ్‌ను ప్రారంభించడం క్రీడాభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

మహిళా జట్లు ఇవే..

ఈ ఏడాది జరగబోయే రగ్బీ లీగ్‌లో మొత్తం ఆరు పురుషుల జట్లు పాల్గొంటుండగా, వాటిలో నాలుగు ఫ్రాంచైజీలు ప్రత్యేకంగా మహిళా జట్లను కూడా రంగంలోకి దించుతున్నాయి. అవేంటంటే.. చెన్నై బుల్స్, ఢిల్లీ రెడ్జ్, ముంబై డ్రీమర్స్, కోల్‌కతా బంగా టైగర్స్. ఇక పురుషుల విభాగంలో ఈ నాలుగు జట్లతో పాటు అదనంగా హైదరాబాద్ హీరోస్, బెంగళూరు బ్రేవ్ హార్ట్స్ జట్లు కూడా తలపడనున్నాయి. రగ్బీ ఇండియా సహకారంతో జీఎంఆర్ స్పోర్ట్స్ సంస్థ ఈ మెగా టోర్నీని నిర్వహిస్తోంది.

ఈ నెల 30న వేలం

మొత్తం ఆరు పురుషుల జట్లు, నాలుగు మహిళా జట్ల కోసం క్రీడాకారుల ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన క్రీడాకారుల డ్రాఫ్ట్, వేలం ఈ నెల 30న హైదరాబాద్‌లోనే జరగనుంది. గతేడాది ముంబైలో జరిగిన పురుషుల లీగ్ విజయవంతం కావడంతో, ఈసారి ‘హెచ్.ఎస్.బి.సి రగ్బీ ప్రీమియర్ లీగ్’ పేరిట మరిన్ని హంగులతో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు.

కల సాకారమైంది: రాహుల్ బోస్

మహిళల రగ్బీ లీగ్ ప్రారంభం కావడంపై రగ్బీ ఇండియా ప్రెసిడెంట్ రాహుల్ బోస్ హర్షం వ్యక్తం చేశారు. "మహిళల రగ్బీ ఎడిషన్‌ను ప్రారంభించాలన్నది రగ్బీ ఇండియా చిరకాల స్వప్నం. భాగస్వామ్య సంస్థల సహకారంతో ఈ ఏడాది ఆ కల నెరవేరుతోంది. పురుషుల 7s రగ్బీ తరహాలోనే మహిళల పోటీలు కూడా అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతాయని ఆశిస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు.