Let's talk: editor@tmv.in
రైతుల కష్టాలపై స్పందించిన ఆర్టీసీ డ్రైవర్ సస్పెన్షన్

రైతుల కష్టాలపై స్పందించిన ఆర్టీసీ డ్రైవర్ సస్పెన్షన్

Gaddamidi Naveen
27 మే, 2026

తెలంగాణలో విమర్శించడం నేరమా? ఇక్కడ రాజ్యాంగం పని చేయడం లేదా? అనే ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తాయి. ధాన్యం కొనుగోళ్ల ఆలస్యంపై మాట్లాడినందుకు ఓ ఆర్టీసీ డ్రైవర్‌పై వేటు పడింది. జగిత్యాల ఆర్‌డీఓ కార్యాలయం వద్ద మే 25న ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఆ సమయంలో టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సు డ్రైవర్ బి. అశోక్ అక్కడ బస్సును నిలిపి, వర్షానికి తడిసిపోతున్న రైతుల పంటలను కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ నేతలను కోరారు. ఒక సామాన్య పౌరుడిగా రైతుల దీనస్థితిని చూసి అశోక్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కానీ, ఈ ఉదంతంపై ప్రభుత్వం ఆయనకు ఊహించని శిక్ష వేసింది. ఇకపై నీకు ఉద్యోగం లేదు, ఇంటికి వెళ్ళిపో అంటూ అశోక్‌ను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు అని స్పష్టంగా పేర్కొనడం గమనార్హం.

దీనిపై ధర్మపురి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సి. లక్ష్మణ్ ఫిర్యాదు చేయడంతో, డిపో మేనేజర్ అదే రోజు అశోక్‌ను విధుల్లోంచి తొలగించారు. తాను ఎలాంటి రాజకీయం మాట్లాడలేదని, కేవలం తన గ్రామ రైతుల దీనస్థితిని మాత్రమే వివరించానని అశోక్ వాపోయారు. ఈ చర్యను బీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తూ, ఇది భావప్రకటన స్వేచ్ఛపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఆ ఆర్టీసీ డ్రైవర్ సస్పెన్షన్ ఎత్తివేసి విధుల్లోకి వెంటనే తీసుకోవాలని కోరుతూ..ఆర్టీసీ ఆర్ఎంకు బీఆర్ఎస్ నాయ‌కులు వినతి పత్రం అందజేశారు. కాగా, రబీ ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులు వేగంగానే జరుగుతున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన భావప్రకటన స్వేచ్ఛ ఏమైంది? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.