
కాకినాడ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణకు రూ. 72 కోట్లు మంజూరు: కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కాకినాడ ఫిషింగ్ హార్బర్‌ను అత్యాధునిక, స్మార్ట్ సదుపాయంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 72 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ శుక్రవారం వెల్లడించారు. విశాఖపట్నంలో జరిగిన ‘సీఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్‌షాప్’ అనంతరం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన ఈ వివరాలు ప్రకటించారు. దీనితో పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థలం కేటాయిస్తే కాకినాడలో ‘నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్’ (ఎన్ఎఫ్‌డీబీ) ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి తమ మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు.
కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. కాకినాడ హార్బర్ చాలా పురాతనమైనది. దానిని స్మార్ట్ హార్బర్‌గా ఆధునికీకరించి, ల్యాండింగ్ సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా మత్స్య ఎగుమతులను ప్రోత్సహించేందుకు రూ. 72.42 కోట్లు మంజూరు చేశామని వివరించారు. కేంద్రం తీసుకున్న ఈ చొరవకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఎన్‌ఎఫ్‌డీబీ ప్రాంతీయ కార్యాలయానికి అవసరమైన భూమిని 15 రోజుల్లోనే కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
గత 11 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న పలు విప్లవాత్మక చర్యల కారణంగా దేశీయ మత్స్య ఉత్పత్తి 106 శాతం పెరిగిందని మంత్రి తెలిపారు. గతంలో 95.8 లక్షల టన్నులుగా ఉన్న ఉత్పత్తి, ప్రస్తుతం 197.7 లక్షల టన్నులకు చేరిందని వివరించారు. అదే సమయంలో 2014కు ముందు రూ.30,213 కోట్లుగా ఉన్న సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 2024–25 నాటికి రూ.62,408 కోట్లకు పెరిగాయి.
అమెరికా పన్నుల పెరుగుదల వంటి ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు రూ.73,000 కోట్లకు చేరాయని ఆయన తెలిపారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే రూ.11,000 కోట్ల వృద్ధి అని చెప్పారు. అంతకుముందు జరిగిన వర్క్‌షాప్‌లో మంత్రి మాట్లాడుతూ, గత దశాబ్దంలో దేశీయ మత్స్య ఉత్పత్తి మరియు ఎగుమతులు రెండింతలు పెరిగి 168 లక్షల టన్నులకు మరియు రూ. 73,000 కోట్లకు పైగా చేరాయని చెప్పారు. దేశీయ మత్స్య ఉత్పత్తిలో అంతర్‌దేశీయ మత్స్య రంగానిదే ప్రధాన వాటా అయినప్పటికీ, ఎగుమతుల్లో దీని వాటా తక్కువగా ఉందన్నారు. ఈ రంగాన్ని వేగవంతం చేయడానికి అంతర్‌దేశీయ రాష్ట్రాల నుంచి ఎగుమతులను ప్రోత్సహించేలా ఒక ప్రామాణిక ఎస్‌ఓపీ ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
