
వడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
రాష్ట్రంలో ఎండల తీవ్రత, వడగాల్పులు అసాధారణ స్థాయికి చేరుకున్నాయి. తీవ్రస్థాయి ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భానుడు భగభగలాడుతున్నాడు. ఇప్పటివరకు 7 జిల్లాల్లో వడదెబ్బ కారణంగా 16 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో శనివారం సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు వడదెబ్బతో మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లాల కలెక్టర్ల నివేదిక ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నలుగురు, వరంగల్ అర్బన్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ముగ్గురు చొప్పున, జోగులాంబ గద్వాల్, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు
రాబోయే మూడు రోజుల్లో వడగాల్పుల తీవ్రత మరింత పెరగనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న మండలాలు, గ్రామాలను గుర్తించి మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ప్రతి గంటకు సమాచారం చేరవేయాలన్నారు. బస్ స్టాండ్లు, మార్కెట్లు, ప్రధాన రహదారుల్లో చల్లని తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. మనుషులతో పాటు జంతువులు, పక్షుల కోసం గ్రామాలు, పట్టణాల్లో నీటి తొట్టెలు, మట్టి కుండల ద్వారా తాగునీరు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మంత్రి పొంగులేటి విజ్ఞప్తి
వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ కూలీలు, నిర్మాణ కార్మికుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి జిల్లా కలెక్టర్ ఈ పరిస్థితులను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని, ఎండదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స అందించేలా అత్యవసర వైద్య సేవలను సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. ఈనెల 26వ తేదీ వరకు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు కొనసాగుతాయని, ఆయా జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు.
