Let's talk: editor@tmv.in
‘అన్నదాత సుఖీభవ’ కింద రూ. 3,125 కోట్ల నిధుల విడుదల
‘అన్నదాత సుఖీభవ’ కింద రూ. 3,125 కోట్ల నిధుల విడుదల

‘అన్నదాత సుఖీభవ’ కింద రూ. 3,125 కోట్ల నిధుల విడుదల

Gaddamidi Naveen
21 జూన్, 2026

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం పల్నాడు జిల్లా లింగంగుంట్లలో నిర్వహించిన ఒక బహిరంగ సభలో ‘పీఎం-కిసాన్ అన్నదాత సుఖీభవ’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు భారీగా ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. ఎన్నికల హామీలో భాగంగా అర్హులైన ప్రతి రైతుకు ఏటా రూ. 20,000 చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.

ప్రస్తుత 2026 ఖరీఫ్ సీజన్‌కు గాను, మొదటి విడత కింద రాష్ట్రంలోని 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ. 7,000 చొప్పున మొత్తం రూ. 3,125 కోట్ల నిధులను ముఖ్యమంత్రి బటన్ నొక్కి నేరుగా జమ చేశారు. అనంతరం సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ మిషన్, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ తదితర ప్రదర్శనలను సీఎం పరిశీలించారు.

ఇదే వేదికపై ‘స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా కర్నూలు, కడప జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ రెండు ప్లాంట్లు 2026 డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు.

ప్రకృతి వ్యవసాయక్షేత్రాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి

లింగంగుంట్ల గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు గుడిపల్లి నాగభూషణం వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నాగభూషణం గత నాలుగేళ్లుగా అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను సీఎంకు వివరించారు. ప్రకృతి వ్యవసాయం వల్ల పెట్టుబడి వ్యయం తగ్గడంతో పాటు భూసారం, దిగుబడులు పెరిగి వ్యవసాయం లాభదాయకంగా మారిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రసాయనాల దుష్ప్రభావాలపై రైతుల్లో అవగాహన కల్పిస్తున్నామని సీఎం చెప్పారు.

అనంతరం నాగభూషణానికి చెందిన ఆర్గానిక్ వేరుశనగ గానుగను పరిశీలించిన సీఎం, సంప్రదాయ ఆధారిత పరిశ్రమలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని అభిప్రాయపడ్డారు. రైతు ఆహ్వానం మేరకు తన సతీమణి భువనేశ్వరితో ఫోన్‌లో మాట్లాడి ఒక లీటర్ కోల్డ్‌ప్రెస్డ్ వేరుశనగ నూనెను కొనుగోలు చేశారు. తర్వాత గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని సందర్శించిన సీఎం, జీవామృతం, ఘన జీవామృతం, వేపాస్త్రం తయారీ విధానాన్ని పరిశీలించారు. వివిధ పంటల సాగుతో జీవ వైవిధ్యం పెరగడంతో పాటు భూసారం, తేమ నిల్వ సామర్థ్యం మెరుగుపడుతుందని రైతు వివరించారు.

ట్యాగ్‌లు
ChandrababuNaiduNaturalFarmingAnnadathaSukhibhavaAndhraPradeshAPFarmersOrganicFarmingPalnaduTeluguNews
‘అన్నదాత సుఖీభవ’ కింద రూ. 3,125 కోట్ల నిధుల విడుదల - Tholi Paluku