Let's talk: editor@tmv.in
తొలి విడతలో 41.37 లక్షల మంది రైతులకు రూ.2,482 కోట్ల ‘రైతు భరోసా’
తొలి విడతలో 41.37 లక్షల మంది రైతులకు రూ.2,482 కోట్ల ‘రైతు భరోసా’

తొలి విడతలో 41.37 లక్షల మంది రైతులకు రూ.2,482 కోట్ల ‘రైతు భరోసా’

Gaddamidi Naveen
1 జులై, 2026

తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం ప్రజా ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించింది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా జరిగిన ‘రైతు భరోసా’ సదస్సులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కంప్యూటర్ మీట నొక్కి ఈ నిధులను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1600 రైతు వేదికల ద్వారా రైతులు ఈ ప్రత్యక్ష కార్యక్రమాన్ని వీక్షించారు. వచ్చే 9 రోజుల్లో మొత్తం రూ. 9,000 కోట్లను విడుదల చేయాలనే సంకల్పంతో.. తొలి విడతగా 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయడానికి వీలుగా ప్రభుత్వం రూ. 2,482.02 కోట్లను విడుదల చేశారు.

ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గత 30 నెలలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని అన్నారు. వ్యవసాయాన్ని పండుగగా మార్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, ఆ రంగానికి ప్రభుత్వం చేసిన ఖర్చు వివరాలను వెల్లడించారు. గత రెండున్నరేళ్లలో వ్యవసాయ రంగానికి మొత్తం రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 25.35 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసి రూ.20,677 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో బకాయిగా ఉన్న రూ.7 వేల కోట్ల రైతు భరోసా నిధులను కూడా తమ ప్రభుత్వం చెల్లించిందని వెల్లడించారు.

రైతు భరోసా మొత్తాన్ని రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచామని, ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.27 వేల కోట్లకు పైగా జమ చేశామని తెలిపారు. తాజాగా విడుదల చేసిన నిధులతో కలిపి రైతు భరోసా కింద మొత్తం రూ.36 వేల కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. అలాగే పంటలకు బోనస్‌గా రూ.4 వేల కోట్లు, వ్యవసాయ పనిముట్ల కోసం రూ.2 వేల కోట్లు, పంటల బీమా కోసం రూ.3.5 వేల కోట్లు చెల్లించినట్లు వివరించారు. వడ్ల కొనుగోలు కోసం గత 30 నెలల్లో రూ.80 వేల కోట్లకు పైగా రైతులకు చెల్లించామని తెలిపారు.

గ‌త ప్రభుత్వం పదేళ్లలో వ్యవసాయ రంగంపై రూ.1.6 లక్షల కోట్లు ఖర్చు చేయగా, తమ ప్రభుత్వం కేవలం 30 నెలల్లోనే రూ.1.75 లక్షల కోట్లు వెచ్చించిందని సీఎం పేర్కొన్నారు. సగటున ప్రతి నెల రూ.6 వేల కోట్లను వ్యవసాయ రంగంపై ఖర్చు చేస్తున్నామని, గతంలో నెలకు రూ.2 వేల కోట్లు కూడా ఖర్చు కాలేదని విమర్శించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయానికి రూ.69 వేల కోట్ల అప్పు ఉండగా, 2014 నుంచి తమ ప్రభుత్వం ఏర్పడే నాటికి అప్పులు రూ.8.11 లక్షల కోట్లకు చేరాయని ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి నెల ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు.

తెలంగాణ ప్రస్తుతం 2.88 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో దేశంలో తొలి స్థానంలో నిలిచిందని సీఎం చెప్పారు. కాళేశ్వరం నుంచి నీటి వినియోగం లేకుండానే ఈ స్థాయి ఉత్పత్తి సాధించామని పేర్కొన్నారు. ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల బాట పట్టించామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మహిళా సంఘాలకు వెయ్యి బస్సులను అప్పగించే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వెల్లడించారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నందున పంటల మార్పిడిపై దృష్టి పెట్టాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, రైతులు ఆత్మగౌరవంతో జీవించేలా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అన్ని చర్యలు కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమం ముగింపులో రైతు భరోసా నిధులు అందుకుంటున్న రైతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, మహ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
RythuBharosaTelanganaTelanganaFarmersRevanthReddyFarmerWelfareAgricultureFarmersFirstFarmerSupportTelanganaGovernmentRythu