Let's talk: editor@tmv.in
రూ. 200 కోట్ల గంజాయి స్మగ్లింగ్: థాయ్‌లాండ్ లింక్స్, అండర్‌వరల్డ్ కనెక్షన్స్ బట్టబయలు!
రూ. 200 కోట్ల గంజాయి స్మగ్లింగ్: థాయ్‌లాండ్ లింక్స్, అండర్‌వరల్డ్ కనెక్షన్స్ బట్టబయలు!

రూ. 200 కోట్ల గంజాయి స్మగ్లింగ్: థాయ్‌లాండ్ లింక్స్, అండర్‌వరల్డ్ కనెక్షన్స్ బట్టబయలు!

Dantu Vijaya Lakshmi Prasanna
5 జూన్, 2026

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాంటీ-నార్కోటిక్స్ విభాగం ఈగల్ ఫోర్స్ అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్న భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను ఛేదించింది. థాయ్‌లాండ్ నుంచి భారత్‌కు అత్యంత ఖరీదైన హైడ్రోపోనిక్ గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నెట్‌వర్క్‌ను గుర్తించి, ప్రధాన సూత్రధారి సహా మొత్తం 17 మందిని అరెస్ట్ చేసింది.

ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబై అండర్‌వరల్డ్‌కు చెందిన మాజీ గ్యాంగ్ సభ్యులు, షూటర్లు కూడా ఈ ముఠాలో భాగస్వాములుగా ఉన్నట్లు ఈగల్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో డ్రగ్స్ వ్యాపారం ద్వారా వందల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.

ఏప్రిల్ 8న ప్రారంభమైన దర్యాప్తు

ఈ ఏడాది ఏప్రిల్ 8న హైదరాబాద్‌ శివారు రామచంద్రాపురంలో ఇద్దరు అనుమానితులను ఈగల్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 12.739 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ.12.7 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. విచారణలో నిందితులు బ్యాంకాక్, హైదరాబాద్, ముంబై కేంద్రాలుగా పనిచేస్తున్న డ్రగ్స్ నెట్‌వర్క్ గురించి కీలక సమాచారం అందించారు. ఆ సమాచారంతో అధికారులు విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.

పట్టాయా కేంద్రంగా డ్రగ్స్ సామ్రాజ్యం

దర్యాప్తులో ప్రధాన సూత్రధారి హేమాంగ్ కెలుస్కర్గా గుర్తించారు. అతను తన తండ్రి, తమ్ముడితో కలిసి 2023లో థాయ్‌లాండ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం పట్టాయాలో క్లబ్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. క్లబ్‌కు వచ్చే భారతీయ యువత, మాదకద్రవ్యాల వినియోగదారులను గుర్తించి వారితో పరిచయాలు పెంచుకున్నాడు. ఆ తర్వాత స్థానిక డ్రగ్స్ సరఫరాదారులు, ప్యాడ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకుని హైడ్రోపోనిక్ గంజాయి స్మగ్లింగ్‌కు బలమైన నెట్‌వర్క్‌ను నిర్మించాడు. థాయ్‌లాండ్‌లో అధిక నాణ్యత గల గంజాయి తక్కువ ధరకు లభిస్తుండటాన్ని అవకాశంగా మలుచుకుని భారీ ఎత్తున కొనుగోళ్లు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

300 మంది క్యారియర్లతో అక్రమ రవాణా

డ్రగ్స్‌ను భారత్‌కు తరలించేందుకు ముఠా ప్రత్యేకంగా "మ్యూల్ క్యారియర్లు" అనే వ్యక్తులను నియమించింది. వీరికి ఒక్కో ట్రిప్‌కు డబ్బులు చెల్లించి, గంజాయిని సామానులో దాచిపెట్టి వివిధ అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా భారత్‌కు తీసుకువచ్చేవారు.

విచారణలో ఇప్పటివరకు సేకరించిన ఆధారాల ప్రకారం, ఈ ముఠా దాదాపు 300 మంది క్యారియర్లను ఉపయోగించినట్లు తేలింది. బ్యాగేజీ తనిఖీలు తక్కువగా ఉంటాయని భావించిన విమానాశ్రయాలను ఎంచుకుని డ్రగ్స్ రవాణా నిర్వహించేవారని అధికారులు తెలిపారు.

250 కిలోల ఓజీ కుష్.. రూ.250 కోట్ల వ్యాపారం

ఈ డ్రగ్స్ కార్టెల్ అక్టోబర్ 2023 నుంచి ఇప్పటి వరకు దాదాపు 250 కిలోల ఓజీ కుష్ గంజాయిని భారత్‌కు తరలించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ గంజాయి విలువ భారత మార్కెట్‌లో రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు ఉంటుందని ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా తెలిపారు.

మరోవైపు తెలంగాణకు చెందిన 14 మంది యువకులను ఒక్కో ట్రిప్‌కు రూ.20 వేల చొప్పున చెల్లిస్తామని ఆశ చూపి అక్రమ రవాణాలో భాగస్వాములను చేశారు. వారు 21 సార్లు థాయ్‌లాండ్ వెళ్లి గంజాయి తీసుకువచ్చినట్లు దర్యాప్తులో బయటపడింది. వారిలో 12 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు.

డీఆర్ఐ, కస్టమ్స్‌కు చిక్కిన క్యారియర్లు

ముంబై, అమ్రేలి, సూరత్, జబల్‌పూర్, రాంచీ, లూధియానా, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన 29 మంది డ్రగ్ క్యారియర్లు ఇప్పటికే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, కస్టమ్స్ అధికారులకు చిక్కినట్లు గుర్తించారు. అలాగే ఇప్పటివరకు 88 మంది క్యారియర్లను గుర్తించగా, వారు బ్యాంకాక్‌కు వెళ్లి వచ్చిన 172 ప్రయాణాల వివరాలు సేకరించినట్లు అధికారులు వెల్లడించారు.

హవాలా మార్గంలో కోట్ల రూపాయల బదిలీలు

భారత్‌లో విక్రయించిన గంజాయి ద్వారా వచ్చిన డబ్బును పూర్తిగా నగదు రూపంలో సేకరించేవారు. అనంతరం ఆ మొత్తాన్ని హవాలా మార్గాల ద్వారా థాయ్‌లాండ్‌కు పంపించి, అక్కడ మళ్లీ డ్రగ్స్ కొనుగోళ్లకు వినియోగించేవారని దర్యాప్తులో తేలింది. బ్యాంకాక్‌లో కిలో గంజాయిని సుమారు రూ.3 లక్షలకు కొనుగోలు చేసి, భారత్‌లో రూ.70 లక్షల నుంచి రూ.1 కోటి వరకు విక్రయించినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ కేసులో ఇంకా పలువురు నిందితులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యక్తులు, హవాలా ఆపరేటర్ల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని ఈగల్ ఫోర్స్ తెలిపింది. దేశవ్యాప్తంగా డ్రగ్స్ రవాణా నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

రూ. 200 కోట్ల గంజాయి స్మగ్లింగ్: థాయ్‌లాండ్ లింక్స్, అండర్‌వరల్డ్ కనెక్షన్స్ బట్టబయలు! - Tholi Paluku