Let's talk: editor@tmv.in
త్రిశూర్ బాధిత కుటుంబాలకు రూ.14 లక్షల పరిహారం

త్రిశూర్ బాధిత కుటుంబాలకు రూ.14 లక్షల పరిహారం

Pinjari Chand
23 ఏప్రిల్, 2026

కేరళం రాష్ట్రంలోని ముండతికోడ్ ప్రాంతంలో పటాకుల నిల్వ ఉంచిన గోదాంలో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించి కనీసం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కేరళం స్టేట్‌ డిజాస్టర్‌‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ నిర్ధారించింది. ఈ ఘటన అనంతరం ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్ అధ్యక్షతన ఆన్‌లైన్ కేబినెట్ సమావేశం నిర్వహించి, బాధితుల కుటుంబాలకు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ప్రకటించారు.

మృతుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయంగా రూ.14 లక్షలు అందజేయనున్నట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. ఇందులో రూ.4 లక్షలు రాష్ట్ర విపత్తు స్పందన నిధి (ఎస్‌డీఆర్‌‌ఎఫ్‌) నుంచి, అదనంగా రూ.10 లక్షలు ముఖ్యమంత్రి నిధి నుంచి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఘటనను ‘ప్రత్యేక విపత్తు’గా వర్గీకరించాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికార సంస్థ కార్యనిర్వాహక కమిటీకి కేబినెట్ ఆదేశించింది. దీని వల్ల అదనపు సహాయక చర్యలు వేగవంతం అవుతాయని పేర్కొన్నారు.

ఘటనపై ఏకసభ్య కమిషన్

పేలుడు కారణాలను గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ విచారణను న్యాయమూర్తి సి ఎన్ రామచంద్రన్ నాయర్ ఆధ్వర్యంలోని ఏకసభ్య కమిషన్ నిర్వహించనుంది. గాయపడిన వారికి విపత్తు నిధి కింద లభించే పరిహారంతో పాటు, తక్షణ సహాయంగా సీఎం నిధి నుంచి అదనంగా రూ.2 లక్షలు అందజేస్తారు. గాయపడిన వారి వైద్య చికిత్స ఖర్చులను ఆరు నెలల పాటు ప్రభుత్వం భరిస్తుంది. జిల్లా కలెక్టర్ సిఫార్సుతో సీఎం నిధి నుంచి నిధులు విడుదల చేస్తారు. ఆరు నెలల తర్వాత కూడా చికిత్స అవసరమైతే, వైద్య బోర్డు నిర్ణయం మేరకు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స ఖర్చులను కూడా సీఎం నిధి నుంచే భరించవచ్చని తెలిపారు.

రక్షణ చర్యల సమయంలో ప్రైవేటు ఆస్తుల గోడలు కూల్చివేయడం, పొలాలను చదును చేశారు. వీటిని పునరుద్ధరించేందుకు అయ్యే ఖర్చులను కూడా విపత్తు నిధి నుంచి చెల్లిస్తారు. మృతదేహాల అంత్యక్రియలు, డీఎన్‌ఏ నమూనాల సేకరణ వంటి అంశాలపై ప్రామాణిక విధి విధానాలు (ఎస్‌వోపీ) జారీ చేయాలని అధికారులకు ఆదేశించారు. అత్యవసర చర్యల కోసం ముందుగా కేటాయించిన రూ.50 లక్షలను జిల్లా కలెక్టర్ వినియోగించేందుకు అనుమతి ఇచ్చారు. పేలుడు ప్రభావంతో సమీప ఇళ్లకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశించారు.