
హైదరాబాద్ మెట్రోకు రూ.13,600 కోట్ల రీఫైనాన్సింగ్.. ఐఆర్ఎఫ్‌సీ ఒప్పందం
హైదరాబాద్ నగర పట్టణ రవాణా మౌలిక వసతుల వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక ముందడుగు వేసింది. ఎల్ అండ్ టీ సంస్థ నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1ను ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంది. ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్‌లోని 100 శాతం వాటాను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న అనంతరం, ఈ ప్రాజెక్టు కోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్ఎఫ్‌సీ) ద్వారా రూ. 13,600 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రీఫైనాన్సింగ్ పొందింది. దీనితో హైదరాబాద్ మెట్రో పూర్తిస్థాయి ప్రభుత్వ యాజమాన్యంలోని వ్యూహాత్మక ప్రజా రవాణా ఆస్తిగా మారింది.
ఢిల్లీలో సోమవారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఐఆర్ఎఫ్‌సీ, ఎల్ అండ్ టీ మెట్రో రైల్, హెచ్ఎమ్ఆర్ఎల్ ల మధ్య ఈ కీలక రుణ ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఐఆర్ఎఫ్‌సీ సీఎండీ & సీఈఓ మనోజ్ కుమార్ దుబే, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పాల్గొన్నారు.
ఆర్థిక భారం తగ్గింపు.. 20 ఏళ్ల కాలపరిమితి
ఈ రూ.13,600 కోట్ల భారీ రీఫైనాన్సింగ్ ద్వారా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం లభించనుంది. ప్రస్తుత రుణ బాధ్యతలైన నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు, వర్కింగ్ క్యాపిటల్ రీఫైనాన్సింగ్‌కు ఈ నిధులను వినియోగిస్తారు. దీనివల్ల పాత రుణదాతలకు క్రమబద్ధమైన ఎగ్జిట్ లభిస్తుంది. గతంలో ఉన్న అధిక వడ్డీ రుణాలను మార్చి, వాటి స్థానంలో తక్కువ వ్యయంతో కూడిన దీర్ఘకాలిక రూపాయి ఫైనాన్సింగ్‌ను భర్తీ చేస్తున్నారు. ఈ రుణాన్ని 20 సంవత్సరాల కాలపరిమితితో, త్రైమాసిక చెల్లింపుల విధానంలో రూపొందించారు. ఈ లావాదేవీకి తెలంగాణ ప్రభుత్వ కచ్చితమైన చెల్లింపు హామీ (స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ)తో పాటు, ఆర్‌బీఐ మద్దతుతో డైరెక్ట్ డెబిట్ మాండేట్ వంటి బలమైన క్రెడిట్ ఎన్‌హాన్స్‌మెంట్ వ్యవస్థ రక్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా సీఎస్ కె. రామకృష్ణారావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో సుస్థిరమైన, పర్యావరణహిత ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉందన్నారు. దేశ ఆర్థిక వృద్ధికి కేంద్రంగా మారుతున్న హైదరాబాద్ నగర వేగవంతమైన అభివృద్ధికి మెట్రో విస్తరణ ఎంతో అవసరమన్నారు.
69.2 కిలోమీటర్ల పొడవుతో మూడు కారిడార్లు, 57 స్టేషన్లతో నిర్మితమైన హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1, దేశంలోనే పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేసిన అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటి. ప్రస్తుతం ఈ నెట్‌వర్క్ ద్వారా ప్రతిరోజూ 5 లక్షలకు పైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఈ రీఫైనాన్సింగ్ వల్ల ప్రస్తుత రుణ భారం తగ్గడమే కాకుండా.. కొత్త కారిడార్లు, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ, చివరి మైలు కనెక్టివిటీ వంటి భవిష్యత్ విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేయడానికి బలమైన ఆర్థిక పునాది ఏర్పడిందని ప్రభుత్వం పేర్కొంది.
ఈ కార్యక్రమంలో హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, జాయింట్ ఎండీ శివేంద్ర ప్రతాప్, ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్, ఎల్ అండ్ టీ ప్రతినిధి కె.వి.బి. రెడ్డి, సీఎఫ్‌వో ఏ.వి.ఆర్. శ్రీనివాస శర్మ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
