
నీటి కొరత నివారణకు జిల్లాలకు రూ.1 కోటి: ఏపీ సీఎం
రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి కొరత తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. నీటి సరఫరా కోసం ప్రతి జిల్లాకు రూ.1 కోటి చొప్పున నిధులు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని, పనిలో లేని బోర్లను మరమ్మతులు చేయాలని స్పష్టం చేశారు.
ఈ మేరకు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించిన సీఎం, వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తగిన ఉపశమన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వడదెబ్బ నివారణ కోసం మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ పంపిణీ చేయాలని, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. ఇక వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి వాహన డీలర్లను అదనపు రిజిస్ట్రేషన్ అథారిటీగా గుర్తించేందుకు సీఎం ఆమోదం తెలిపారు. ఈ ప్రక్రియ 24 గంటల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వ సేవల్లో ఏఐ వినియోగం
ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ఏఐ వినియోగాన్ని విస్తరించాలని సీఎం సూచించారు. ఇందుకు నిపుణులతో కూడిన సలహా మండలి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిదంగా డ్రోన్ల వినియోగాన్ని పెంచేందుకు ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించాలని ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న సాంకేతిక విధానాలను అధ్యయనం చేసి ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయాలని తెలిపారు.
అదేవిదంగా అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్‌లో అందించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజల్లో విశ్వాసం పెంపొందించేందుకు పబ్లిక్ కనెక్ట్ కీలకమని పేర్కొన్నారు. ప్రతి శాఖ నిర్దేశిత ప్రమాణాల ప్రకారం పనిచేయాలని సేవలపై ప్రజాభిప్రాయాన్ని కాల్ సెంటర్ల ద్వారా సేకరించాలని సూచించారు.
అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలు
ప్రభుత్వ పథకాల అమలు పర్యవేక్షణ కోసం ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం ఆదేశించారు. కార్యదర్శులు నెలలో మూడు రోజులు, హెచ్‌ఓడీలు ఆరు రోజులు, జిల్లా కలెక్టర్లు ఎనిమిది రోజులు ప్రజల మధ్య ఉండి సమస్యలు తెలుసుకోవాలని నిర్దేశించారు.
రైతులు, మత్స్యకారులకు దిశానిర్దేశం
పంటలకు సరైన ధరలు లభించేలా మార్కెట్ పరిస్థితులను నిరంతరం విశ్లేషించాలని ఆదేశించారు. అదేవిధంగా చేపల వేట నిషేధం అనంతరం డేటా ఆధారంగా చేపలు సమృద్ధిగా లభించే ప్రాంతాల సమాచారం మత్స్యకారులకు అందించాలన్నారు.
ఈ సమీక్ష సమావేశానికి సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, సీఎస్ జి. సాయి ప్రసాద్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
