Let's talk: editor@tmv.in
ఈ నెలలోనే వెలిగొండ నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారం: మంత్రి నిమ్మల రామానాయుడు
ఈ నెలలోనే వెలిగొండ నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారం: మంత్రి నిమ్మల రామానాయుడు

ఈ నెలలోనే వెలిగొండ నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారం: మంత్రి నిమ్మల రామానాయుడు

Gaddamidi Naveen
17 జూన్, 2026

నల్లమలసాగర్ రిజర్వాయర్‌ను నీటితో నింపడమే లక్ష్యంగా వెలిగొండ ప్రాజెక్టు పనులను కూటమి ప్రభుత్వం ముమ్మరం చేసిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మంగళవారం ఆయన అధికారులతో కలిసి డోర్నాలలో వెలిగొండ ప్రాజెక్టు జంట సొరంగాల్లోకి వెళ్లి టన్నెల్ లైనింగ్, టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం) తొలగింపు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేర‌కు, సీజన్ మొదలయ్యే నాటికి నల్లమలసాగర్ నింపేలా పనులు జరుగుతున్నాయన్నారు. నిర్వాసితుల పునరావాసం (ఆర్అండ్‌ఆర్) కోసం అదనపు బడ్జెట్‌లో రూ. 905 కోట్లు కేటాయించామని, ఈ నెలలోనే సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ పరిహారాన్ని అందిస్తామని స్పష్టం చేశారు.

ప్రాజెక్టులో హెడ్ రెగ్యులేటర్ల రిటైనింగ్ వాల్, వింగ్స్, రిటర్న్స్ పనులు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. కొల్లంవాగు నుంచి టన్నెల్‌లలోకి ఒక టీఎంసీ నీరు చేరేలా మక్ తొలగింపు పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. టన్నెల్-2లో తొలగించాల్సిన 1.80 లక్షల క్యూబిక్ మీటర్ల మక్‌లో ఇప్పటివరకు 58 వేల క్యూబిక్ మీటర్లు తొలగించగా, టన్నెల్-1లో 1.20 లక్షల క్యూబిక్ మీటర్లలో 40 వేల క్యూబిక్ మీటర్ల మక్ తొలగించినట్లు వివరించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టన్నెల్-2లో 7 కిలోమీటర్ల లైనింగ్‌లో 5.5 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని, మిగిలిన 1.5 కిలోమీటర్ల పనులను జూలై చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు టన్నెల్-2లో చిక్కుకుపోయిన టీబీఎం తొలగింపు పనులు చేపట్టామని, మొత్తం ఏడు కంపార్ట్‌మెంట్‌లలో మూడు ఇప్పటికే బయటకు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఫీడర్ కెనాల్‌లో 5.3 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ పనులు పూర్తయ్యాయని, మిగిలిన 21 కిలోమీటర్ల లైనింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. తీగలేరు, ఈస్టర్న్ మెయిన్ కెనాల్, శాశ్వత డైవర్షన్ రోడ్డు పనులు జూన్ నెలాఖరులోగా పూర్తవుతాయని మంత్రి వెల్లడించారు.

వైసీపీపై తీవ్ర విమర్శలు

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని మంత్రి మండిపడ్డారు. వెనుకబడిన ప్రకాశం జిల్లా ప్రజలకు ఆ ‘గొడ్డలి పార్టీ’ నాయకులు చేసిన మోసాన్ని వారే ఒప్పుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించి నిర్వాసితులకు అండగా నిలిచిందని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు, జలవనరుల శాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ప్రాజెక్ట్ సీఈ రమేష్ బాబు, ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.