Let's talk: editor@tmv.in
ఏపీలో రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీ పెట్టుబడి..రూ. 2,200 కోట్లతో తయారీ కేంద్రం
ఏపీలో రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీ పెట్టుబడి..రూ. 2,200 కోట్లతో తయారీ కేంద్రం

ఏపీలో రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీ పెట్టుబడి..రూ. 2,200 కోట్లతో తయారీ కేంద్రం

Panthagani Anusha
8 మే, 2026

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో భారీ పెట్టుబడి ఖరారైంది. ప్రముఖ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ, ఐషర్ మోటార్స్‌కు చెందిన 'రాయల్ ఎన్‌ఫీల్డ్' రాష్ట్రంలో తన యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. తిరుపతి జిల్లా సత్యవేడు సమీపంలో సుమారు రూ. 2,200 కోట్ల భారీ వ్యయంతో తయారీ ప్లాంట్‌తో పాటు వెండర్ పార్క్‌ను నెలకొల్పనుంది. ఇప్పటివరకు తమిళనాడుకే పరిమితమైన ఈ సంస్థ ఆ రాష్ట్రం వెలుపల చేపడుతున్న తొలి అతిపెద్ద విస్తరణ ప్రాజెక్టు ఇదే కావడం విశేషం.

ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి సమావేశంలో ఈ ప్రాజెక్టుకు అధికారికంగా ఆమోదం లభించింది. ఈ భారీ యూనిట్ ద్వారా రాష్ట్రంలో ఆటోమొబైల్ తయారీ రంగం కొత్త పుంతలు తొక్కనుంది. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 5,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాల పట్ల సంస్థ సంతృప్తి వ్యక్తం చేసింది.

ఈ ప్రాజెక్టు కోసం సత్యవేడు మండలంలోని వనెల్లూరు, రాళ్లకుప్పం గ్రామాల్లో భూమిని కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కొత్త యూనిట్ ద్వారా రాయల్ ఎన్‌ఫీల్డ్ తన వార్షిక తయారీ సామర్థ్యాన్ని 9 లక్షల యూనిట్లకు పెంచుకోనుంది. దీనివల్ల గ్లోబల్ ప్రీమియం మోటార్‌సైకిల్ తయారీ హబ్‌గా భారత్ మరింత బలోపేతం కానుంది. ప్రధాన ప్లాంట్‌తో పాటు విడిభాగాలను సరఫరా చేసే కంపెనీల కోసం ప్రత్యేకంగా 'వెండర్ పార్క్' కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇది ఏపీలో ఒక సమగ్ర ఆటోమొబైల్ క్లస్టర్ అభివృద్ధికి దారితీయనుంది.

ఇక ఈ భారీ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. మొదటి దశను 2029 నాటికి రెండో దశను 2032 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పెట్టుబడిపై రాష్ట్ర ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. మొబిలిటీ, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు రాకతో దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.