Let's talk: editor@tmv.in
ఏపీలో రాకెట్ ఇంధన తయారీ కేంద్రం.. అనంతపురంలో 121 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

ఏపీలో రాకెట్ ఇంధన తయారీ కేంద్రం.. అనంతపురంలో 121 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

Gaddamidi Naveen
30 జూన్, 2026

అంతరిక్ష, రక్షణ రంగాలలో సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్న ప్రముఖ డీప్-టెక్ స్టార్టప్ సంస్థ ‘స్పేస్‌ఫీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ఆంధ్రప్రదేశ్‌లో ఒక అత్యాధునిక సాలిడ్ ప్రొపెల్లెంట్ (రాకెట్ ఇంధనం) ప్రాసెసింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మద్దతుతో ప్రారంభమైన ఈ సంస్థకు అనంతపురం జిల్లా తిమ్మసముద్రం పారిశ్రామిక పార్కులో 121 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదలైంది.

ఈ సరికొత్త తయారీ కేంద్రం ద్వారా రక్షణ, అంతరిక్ష రంగాలలో క్లిష్టమైన వ్యూహాత్మక ప్రొపెల్షన్ టెక్నాలజీస్ లో భారతదేశ స్వదేశీ సామర్థ్యాలు మరింత బలోపేతం కానున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 300 మంది నిపుణులకు ప్రత్యక్షంగా ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. జూలై 2028 నాటికి ఇక్కడ వాణిజ్యపరమైన ఉత్పత్తిని ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

స్పేస్‌ఫీల్డ్స్ సమర్పించిన ఈ ప్రతిపాదనను రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) నిశితంగా పరిశీలించి ఆమోదం తెలిపాయి. రాకెట్ ఇంధనం వంటి అత్యంత సున్నితమైన, రసాయన ఆధారిత తయారీ రంగం కావడంతో, దేశంలోని కఠినమైన భద్రతా నిబంధనల ప్రకారం విస్తృతమైన సేఫ్టీ బఫర్ జోన్లతో కూడిన భారీ క్యాంపస్ అవసరమని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ వేగంగా సాకారమవడానికి వీలుగా ఏపీ ప్రభుత్వం ఈ సైట్‌కు అవసరమైన నీటి సరఫరా, హై-వోల్టేజ్ విద్యుత్ కనెక్టివిటీ, రోడ్డు రవాణా వంటి మౌలిక సదుపాయాలను కల్పించనుంది.

ఐటీ మంత్రి నారా లోకేష్ హర్షం

ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్ తరం ఉత్పాదక రంగం అనేది డిఫెన్స్, స్పేస్, అడ్వాన్స్‌డ్ ఇంజనీరింగ్ రంగాల కలయికతో పనిచేసే డీప్-టెక్ కంపెనీల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. నవభారత ఆకాంక్షలకు 'స్పేస్‌ఫీల్డ్స్' సంస్థ ఒక అద్భుతమైన ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ అంతరిక్ష పరిశ్రమ స్థాపనతో అధునాతన ఏరోస్పేస్, రక్షణ రంగాల తయారీకి ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన కేంద్రంగా మారడమే కాకుండా, కీలకమైన వ్యూహాత్మక రంగాలలో స్వయం సమృద్ధిని సాధించాలనే భారతదేశ జాతీయ లక్ష్యానికి బలమైన మద్దతు లభించనుంది.

ట్యాగ్‌లు
SpaceFieldsAndhraPradeshAPNewsRocketFuelSolidPropellantAerospaceSpaceTechnologyDefenceDefenceManufacturingISROMakeInIndia
ఏపీలో రాకెట్ ఇంధన తయారీ కేంద్రం.. అనంతపురంలో 121 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం - Tholi Paluku