Let's talk: editor@tmv.in
రోడ్డు భద్రత అందరి బాధ్యత: ఆదిలాబాద్‌లో బైక్ ర్యాలీని ప్రారంభించిన మంత్రి పొన్నం
రోడ్డు భద్రత అందరి బాధ్యత: ఆదిలాబాద్‌లో బైక్ ర్యాలీని ప్రారంభించిన మంత్రి పొన్నం

రోడ్డు భద్రత అందరి బాధ్యత: ఆదిలాబాద్‌లో బైక్ ర్యాలీని ప్రారంభించిన మంత్రి పొన్నం

Gaddamidi Naveen
16 ఏప్రిల్, 2026

రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనల పాటింపు కేవలం చట్టం మాత్రమే కాదని, అది మన ప్రాణాలకు రక్షా కవచమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్ఘాటించారు. ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 'ప్రజా పాలన–ప్రగతి' కార్యక్రమంలో భాగంగా రవాణా శాఖ నిర్వహించిన “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

దేశంలో ప్రకృతి వైపరీత్యాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతుండటం పట్ల మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం నాలుగు కీలక అంశాలపై దృష్టి సారించిందని ఆయన వివరించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడం, రహదారుల నిర్మాణ నాణ్యతను మెరుగుపరచడం, లోపాలను సరిచేయడం, ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయడం, ప్రమాదాల సమయంలో వెంటనే వైద్య సహాయం అందించడం వంటి చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

25 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు అధిక వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, తప్పు మార్గాల్లో ప్రయాణించడం వంటి కారణాలతో ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని మంత్రి హెచ్చరించారు. హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం ప్రాణాలను కాపాడుతుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముందు “హెల్మెట్ – సేవ్ లైవ్స్” ఆకారంలో విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేసి నినాదాలు చేశారు. యువతకు లెర్నింగ్ లైసెన్సులు పంపిణీ చేయడంతో పాటు డ్రైవర్లకు ఉచితంగా కళ్లద్దాలు అందజేశారు. స్టేడియంలో తాగునీటి సదుపాయాన్ని మంత్రి ప్రారంభించారు.

అనంతరం ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి అంబేద్కర్ చౌక్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించగా, మంత్రి స్వయంగా పాల్గొని యువతను ప్రోత్సహించారు. అంబేద్కర్ చౌక్ వద్ద వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేసి అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, యువత వేగాన్ని నియంత్రించుకోవాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ఆత్మహత్యతో సమానమని అన్నారు. ప్రజల ప్రవర్తనలో మార్పు రాకపోతే పోలీసు, రవాణా శాఖల కృషి ఫలించదని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, కలెక్టర్ యువరాజ్ మర్మత్, ఎస్పీ అఖిల్ మహాజన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.