
విజయవాడలో రోడ్ రేజ్ కలకలం
విజయవాడ నగరంలో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఒక రోడ్ రేజ్ ఉదంతం తీవ్ర కలకలం రేపింది. పాత కక్షలను మనసులో పెట్టుకుని ఇద్దరు యువకులు తమ లగ్జరీ కార్లతో ఒకరినొకరు ఢీకొట్టుకుంటూ నడిరోడ్డుపై భీభత్సం సృష్టించారు. సినిమా ఫైటింగ్‌ను తలపించేలా సాగిన ఈ హైడ్రామాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధ్యులైన ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
యువతి విషయంలో పెరిగిన వివాదం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్‌టీఆర్ జిల్లా పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని గురునానక్ కాలనీకి చెందిన లింగమనేని రోహిత్ (19), బొల్ల ఓం (21) గతంలో స్నేహితులు. అయితే ఇటీవల వీరి మధ్య వ్యక్తిగత విభేదాలు తలెత్తడంతో దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఒక యువతితో మాట్లాడేటప్పుడు, ఓం గురించి రోహిత్ ప్రతికూలంగా (తప్పుగా) మాట్లాడాడనే విషయం ఇద్దరి మధ్య అపార్థాలను మరింత పెంచింది. గత నెల రోజులుగా మాటలు లేని వీరిద్దరూ, ఈ వివాదానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు.
అయితే సమస్యను పరిష్కరించుకునేందుకు గురువారం రాత్రి గురునానక్ కాలనీలోని హైటెన్షన్ రోడ్డు వద్ద ఇద్దరూ కలుసుకున్నారు. అయితే అక్కడ పాత గొడవలు మళ్లీ తెరపైకి రావడంతో మాట మాట పెరిగి వివాదం కాస్తా తీవ్ర రూపం దాల్చింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఇద్దరు యువకులు తమ నల్లరంగు ఎస్‌యూవీ వాహనాల్లోకి ఎక్కి ఒకరి కారును మరొకరు వేగంగా ఢీకొట్టుకోవడం ప్రారంభించారు. రోడ్డుపై వెళ్తున్న ప్రజలను భయాందోళనలకు గురిచేస్తూ పరస్పరం కార్లతో దాడులు చేసుకున్నారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే అదృష్టవశాత్తూ ఇద్దరికీ ఎలాంటి శారీరక గాయాలు కాలేదని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ ఘోరమైన రోడ్ రేజ్ దృశ్యాలను స్థానికులు కొందరు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. దీనిపై సుమోటోగా స్పందించిన పటమట పోలీసులు తక్షణమే దర్యాప్తు చేపట్టి రోహిత్, ఓంలను అరెస్ట్ చేశారు. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది. ప్రస్తుతం వీరిద్దరూ విజయవాడ జైలులో ఉన్నారు.
ప్రజా రక్షణకు భంగం కలిగించినందుకు గానూ వీరిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 109 కింద హత్యాయత్నం కేసుతో పాటు ప్రజలకు ఇబ్బంది కలిగించడం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పటమట పోలీసులు వెల్లడించారు.
