Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు.. ధన్యవాదాలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు

హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు.. ధన్యవాదాలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు

Gaddamidi Naveen
28 జూన్, 2026

భారత్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ పక్కనున్న రహదారికి 'డోనాల్డ్ ట్రంప్ అవెన్యూ' అని పేరు పెట్టిన నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. తనకు దక్కిన ఈ అరుదైన గౌరవానికి గాను ఆయన భారతదేశానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ విషయమై ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక 'ట్రూత్'లో స్పందిస్తూ.. "భారతదేశంలోని హైదరాబాద్‌లో నూతనంగా ‘డోనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ ఏర్పాటయింది. ఈ తరహా గౌరవం పొందిన అమెరికా తొలి అధ్యక్షుడిని నేనే. ధన్యవాదాలు భారత్ అని పోస్ట్ చేశారు.

అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 23న హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి ‘ఫ్రీడమ్ 250’ పేరిట ఒక భారీ గాలా రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకలో హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్‌ పక్కన ఉన్న రోడ్డుకు 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా నామకరణం చేశారు. ఆ ప్రత్యేక ఫలకాన్ని అమెరికా రాయబారి సెర్గియో గోర్‌తో కలిసి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆవిష్కరించారు.

ఈ చారిత్రాత్మక వేడుకలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ తో పాటు రక్షణ, వైమానిక, సాంకేతిక రంగాల ప్రముఖులు, సీనియర్ దౌత్యవేత్తలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ ప్రత్యేక నిర్ణయం అమెరికా పట్ల ఉన్న గౌరవాన్ని చాటడమే కాకుండా, అమెరికా-భారత్‌ సంబంధాలను బలోపేతం చేయడంలో హైదరాబాద్ పోషిస్తున్న కీలక పాత్రకు నిదర్శనమని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అమెరికా రాయబారి సెర్జియో గోర్ మాట్లాడుతూ, భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో హైదరాబాద్ కీలక కేంద్రంగా ఎదుగుతోందని పేర్కొన్నారు. హైటెక్ సిటీ, ఏరోస్పేస్, రక్షణ, సాంకేతిక రంగాల్లో హైదరాబాద్ సాధిస్తున్న పురోగతి రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తోందని ఆయన అన్నారు. అలాగే ఇరు దేశాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం, ‘మిషన్ ఇండియా’ ద్వారా అమెరికాలో 20 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఈ భాగస్వామ్యం ఇరు దేశాలకు ప్రయోజనకరంగా మారుతుందని ఆయన వెల్లడించారు.

ట్యాగ్‌లు
DonaldTrumpTrumpDonaldTrumpAvenueHyderabadUSIndiaRelationsIndiaUSUSConsulateTelanganaRevanthReddyBhattiVikramarkaDiplomacyFreedom250
హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు.. ధన్యవాదాలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు - Tholi Paluku