Let's talk: editor@tmv.in
దుబాయ్‌‌లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు జగిత్యాల వాసుల మృతి

దుబాయ్‌‌లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు జగిత్యాల వాసుల మృతి

Gaddamidi Naveen
11 జూన్, 2026

ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన జగిత్యాల జిల్లాకు చెందిన ముగ్గురు కార్మికులు అక్కడ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించడం పట్ల తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. అధికారిక ప్రకటన ప్రకారం.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండకు చెందిన సయ్యద్ సలీమ్, మెట్‌పల్లి గాజులపేటకు చెందిన అబ్దుల్ రఫీక్, మాల్యాల మండలం తక్కళ్లపల్లికి చెందిన గొల్లపల్లి తిరుపతి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

ఈ దుర్ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ తక్షణమే స్పందించారు. ఎన్నారై అడ్వైజరీ సెల్ చైర్మన్‌తో ఫోన్‌లో మాట్లాడి, మరణించిన తెలంగాణ కార్మికుల భౌతికకాయాలను వీలైనంత త్వరగా వారి స్వగ్రామాలకు తీసుకురావడానికి అవసరమైన అన్ని తక్షణ సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు. కష్టకాల పరిస్థితుల్లో ఉన్న మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని, పూర్తి మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చారు.

దుబాయ్‌లో సోమవారం కార్మికులతో వెళ్తున్న ఒక మినీబస్సు, రోడ్డు మధ్యలో ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దుబాయ్ పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మరణించగా, తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

దుబాయ్ ట్రాఫిక్ పోలీస్ జనరల్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ జుమా సలేం బిన్ సువైదాన్ తెలిపిన వివరాల ప్రకారం.. మినీబస్సు డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం, ముందున్న వాహనానికి స‌రైన‌ దూరం పాటించకపోవడం వల్లే నియంత్రణ కోల్పోయి ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. గాయపడిన తొమ్మిది మందిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉండగా, నలుగురు మధ్యస్థంగా గాయపడ్డారు. వారందరినీ చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారని గల్ఫ్ మీడియా నివేదించింది.

ఈ ప్రమాదంపై దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా స్పందించింది. మరణించిన భారతీయ కార్మికుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ.. తమ అధికారులు తక్షణమే ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న భారతీయులను పరామర్శించారని పేర్కొంది. బాధితులకు సాధ్యమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి స్థానిక దుబాయ్ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నట్లు భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.