
సొంత పార్టీ దిశగా ఆర్.కె. సింగ్: బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణం!
మాజీ కేంద్ర మంత్రి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్.కె. సింగ్ భారతీయ జనతా పార్టీని వీడిన ఐదు నెలల తర్వాత సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించారు. ఢిల్లీలో సీనియర్ జర్నలిస్ట్ మనోజ్ టిబ్రేవాల్ ఆకాశ్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన విషయాలను వెల్లడించారు. దేశ ప్రయోజనాలు, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా తన నూతన పార్టీ పని చేస్తుందని, ముఖ్యంగా బీహార్ రాజకీయాలపై దృష్టి సారిస్తుందని ఆయన స్పష్టం చేశారు. నీతిమంతులు, విద్యావంతులు, కులమతాలకు అతీతంగా ఆలోచించే వ్యక్తులతో కలిసి ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తమ పార్టీ విలక్షణమైన సిద్ధాంతాలతో ముందుకు సాగుతుందని చెబుతూ, ప్రస్తుత రాజకీయాల్లో నెలకొన్న కుల సమీకరణాలను తాను వ్యతిరేకిస్తున్నట్లు ఆర్.కె. సింగ్ తెలిపారు. 73 ఏళ్ల వయసులో కొత్త పార్టీ పెట్టడంపై ఆయన స్పందిస్తూ, బీహార్ అభివృద్ధికి నిజాయితీ గల నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. 2014లో ఐఏఎస్ అధికారిగా పదవీ విరమణ చేసిన అనంతరం బీజేపీలో చేరి, ఆరా నియోజకవర్గం నుండి లోక్‌సభ ఎంపీగా గెలుపొందారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా ఏడేళ్ల పాటు పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. అయితే, గతేడాది నవంబర్‌లో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారనే నెపంతో తనపై విధించిన సస్పెన్షన్ పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీజేపీకి రాజీనామా చేశారు.
తమ సస్పెన్షన్‌పై స్పందిస్తూ, తాను ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా మాట్లాడటం వల్లనే పార్టీ ఈ చర్య తీసుకుందని ఆయన ఆరోపించారు. "నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా నిర్మొహమాటంగా మాట్లాడేవాడిని, ఆ స్వభావమే నన్ను సస్పెన్షన్‌కు గురిచేసింది. కానీ నేను దీనిని శిక్షగా భావించడం లేదు" అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్ల ఆయన కృతజ్ఞతను చాటుకున్నారు. తాను అన్ని విషయాలను బహిరంగంగా మాట్లాడినప్పటికీ, ఏడేళ్ల పాటు తనను మంత్రిగా కొనసాగించడం మోడీ గొప్పతనమని కొనియాడారు. తన మంత్రిత్వ శాఖలో ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం ఎప్పుడూ లేదని, తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని ఆయన గుర్తు చేసుకున్నారు.
ముఖ్యమంత్రి అవినీతిపరుడు కాకపోవచ్చు కానీ ..
బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై ఆర్.కె. సింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. నితీష్ కుమార్ మొదటి దఫా పాలన బాగున్నప్పటికీ, రెండో దఫాలో అవినీతి రాజ్యమేలిందని ఆయన ఆరోపించారు. "ముఖ్యమంత్రి అవినీతిపరుడు కాకపోవచ్చు, కానీ తన చుట్టూ ఉన్న 99 శాతం మంది మంత్రులు అవినీతిలో కూరుకుపోయినప్పుడు దాని బాధ్యత ముఖ్యమంత్రిదే అవుతుంది. అటువంటి పాలన సిగ్గుచేటు" అని ఘాటుగా విమర్శించారు. బీహార్‌లో సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్నప్పటికీ పాలనలో పారదర్శకత లేకపోవడం రాష్ట్ర వెనుకబాటుతనానికి కారణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సమ్రాట్ చౌదరికి ముఖ్య మంత్రి అర్హతలేదు!
బీహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి పట్ల కూడా ఆర్.కె. సింగ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 15న బీహార్‌లో తొలిసారిగా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడిన క్రమంలో సమ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన వ్యక్తిత్వం, విద్యాార్హతలపై సింగ్ సందేహాలు వ్యక్తం చేశారు. "మంచి క్యారెక్టర్, నిజాయితీ సరైన విద్య లేని వ్యక్తి రాష్ట్రానికి ఏం చేయగలడు? అటువంటి నాయకత్వం వల్ల రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది" అని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఉండాల్సిన గౌరవం ఆయనకు లేదని సింగ్ అభిప్రాయపడ్డారు.
తన రాజకీయ భవిష్యత్తు గురించి చర్చిస్తూ, బీహార్ ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ శక్తిని అందించడమే తన లక్ష్యమని ఆర్.కె. సింగ్ వివరించారు. అధికార దాహం కంటే కూడా వ్యవస్థలో మార్పు తీసుకురావాలనే తపన తనలో ఉందన్నారు. మాజీ కేంద్ర హోం సెక్రటరీగా వ్యవస్థపై తనకు పూర్తి అవగాహన ఉందని, ఆ అనుభవంతో బీహార్‌ను ప్రగతిపథంలో నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే తన పార్టీ పేరు, జెండా ఇతర విధివిధానాలను ప్రకటిస్తానని తెలిపారు. ఈ పరిణామం బీహార్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది, ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో ఈ కొత్త పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుందోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
