Let's talk: editor@tmv.in
రెండేళ్లలో క్రీడలు, యువజన రంగాల్లో విప్లవాత్మక మార్పులు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

రెండేళ్లలో క్రీడలు, యువజన రంగాల్లో విప్లవాత్మక మార్పులు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

Gaddamidi Naveen
25 జూన్, 2026

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గత రెండేళ్లలో రాష్ట్రంలో క్రీడలు, యువజన సేవల రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అమరావతి సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో యువత, క్రీడాకారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయబడిందన్నారు.

గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన క్రీడా వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టిందని మంత్రి చెప్పారు. విజయనగరం విజ్జీ స్టేడియం, తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఆధునిక ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను పూర్తి చేసి ప్రారంభించామని వెల్లడించారు. ఖేలో ఇండియా పథకం కింద రూ.75 కోట్ల వ్యయంతో విజయవాడ, కుప్పం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, గుంటూరులో ఆధునిక క్రీడా మౌలిక వసతుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు రూ.5.60 కోట్ల నగదు ప్రోత్సాహకాలు అందించగా, వివిధ క్రీడా విభాగాల్లో రాణించిన 429 మంది క్రీడాకారులకు రూ.19 కోట్ల ప్రోత్సాహకాలు అందించినట్లు చెప్పారు. క్రీడాకారుల ఉద్యోగ రిజర్వేషన్లను 2 శాతం నుంచి 3 శాతానికి పెంచడంతో గత రెండేళ్లలో 819 మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందారని వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో క్రీడా వికాస కేంద్రాల నిర్మాణం చేపట్టగా, 46 కేంద్రాలు పూర్తయ్యాయని, మరో 91 పనులు పురోగతిలో ఉన్నాయని మంత్రి వివరించారు. అమరావతి ఛాంపియన్‌షిప్‌లు, పారా బ్యాడ్మింటన్, బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ వంటి జాతీయ స్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.

యువజన సేవల విభాగం ఆధ్వర్యంలో యువజన ఉత్సవాలు, నాయకత్వ వికాస కార్యక్రమాలు, కెరీర్ కౌన్సెలింగ్, సామాజిక అవగాహన కార్యక్రమాల ద్వారా లక్షలాది మంది యువతకు ప్రయోజనం చేకూరిందన్నారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, సైబర్ నేరాలు, మహిళల భద్రతపై 593 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, 2,820 యువజన క్లబ్‌లను ఏర్పాటు చేసి యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తున్నామని చెప్పారు. అనంతరం మంత్రి 2026 ఆంధ్ర యువసంకల్ప్ 2026 కరపత్రాన్ని విడుదల చేశారు.

ట్యాగ్‌లు
AndhraPradeshAPSportsYouthDevelopmentSportsInfrastructureKheloIndiaAndhraYouthSportsForAllYouthEmpowermentTeamAPSportsNews
రెండేళ్లలో క్రీడలు, యువజన రంగాల్లో విప్లవాత్మక మార్పులు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి - Tholi Paluku