Let's talk: editor@tmv.in
జూన్ 5 నుంచి సవరించిన భూముల మార్కెట్ విలువలు అమల్లోకి: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

జూన్ 5 నుంచి సవరించిన భూముల మార్కెట్ విలువలు అమల్లోకి: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

Gaddamidi Naveen
4 జూన్, 2026

రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల సవరణను శాస్త్రీయంగా, హేతుబద్ధంగా చేపట్టామని, సవరించిన కొత్త విలువలు ఈ నెల 5 నుంచి అమలులోకి వస్తాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం మేరకు, భూముల వాస్తవ మార్కెట్ ధరలు, ప్రభుత్వ విలువల మధ్య ఉన్న వ్యత్యాసాలను సరిచేసేందుకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు ఆయన తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఆర్థిక నిపుణుడు అరవింద్ సుబ్రమణ్యం నివేదిక, ఉన్నతాధికారుల సలహాలు, క్షేత్రస్థాయి అధ్యయనాల ఆధారంగా కొత్త విలువలను నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. భూముల మార్కెట్ పరిస్థితులు, రిజిస్ట్రేషన్ల సంఖ్య, బహిరంగ మార్కెట్ ధరలు, ప్రాంతాల అభివృద్ధి స్థాయి వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2021-22లో కేవలం ఆరు నెలల వ్యవధిలో రెండుసార్లు భూముల ధరలను పెంచిందని, ఎలాంటి సమగ్ర అధ్యయనం లేకుండా చేపట్టిన ఆ నిర్ణయాల వల్ల కొన్ని ప్రాంతాల్లో విలువలు మార్కెట్ ధరల కంటే ఎక్కువగా, మరికొన్ని చోట్ల తక్కువగా నిర్ణయించబడ్డాయని విమర్శించారు. దీంతో భూ లావాదేవీలలో అనేక సమస్యలు తలెత్తాయని అన్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో మార్కెట్ విలువల పునర్విమర్శ చేపట్టినట్లు తెలిపారు. గ్రామీణ, పట్టణ మార్కెట్ విలువల సవరణ కమిటీలు స్థానిక పరిస్థితులను అధ్యయనం చేసి కొత్త విలువలను రూపొందించాయని చెప్పారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్, కొత్త రహదారులు, పారిశ్రామికాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, భూముల డిమాండ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

ఫ్లాట్ల విషయంలో గతంలో ఉన్న అసమానతలను తొలగిస్తూ కొన్ని ప్రాంతాల్లో అన్ని అంతస్తులకు ఒకే రేటు వర్తింపజేసినట్లు తెలిపారు. నిర్మాణ సామగ్రి ధరలు, కార్మిక వ్యయాలు పెరిగిన నేపథ్యంలో నిర్మాణ రేట్లను కూడా సవరించినట్లు చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, పారదర్శకతతో చేపట్టిన ఈ నిర్ణయం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, భూ లావాదేవీలలో పారదర్శకత పెంపునకు దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు.