Let's talk: editor@tmv.in
పాలమూరు ప్రాజెక్టుపై సమీక్ష ‘పోరుబాట’ భయంతోనే: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

పాలమూరు ప్రాజెక్టుపై సమీక్ష ‘పోరుబాట’ భయంతోనే: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

Gaddamidi Naveen
20 మే, 2026

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై గత రెండున్నరేళ్లుగా నిర్లక్ష్యం వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన పాదయాత్ర, పోరుబాట భయంతోనే మొద్దు నిద్ర వీడిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించడంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో కదలిక వచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ హయాంలోనే పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన కేవలం 10 శాతం పనులను పూర్తి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విలువైన రెండున్నరేళ్ల సమయాన్ని వృధా చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగిపోతోందని ఆరోపించారు. కాలువల టెండర్లను రద్దు చేయడం, రెండన్నరేళ్లుగా తట్టెడు మట్టి కూడా ఎత్తకపోవడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. తాను పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి, గత రెండున్నరేళ్లుగా ఒక్కనాడు కూడా ఈ ప్రాజెక్టులపై సమీక్ష చేయలేదు. కేసీఆర్ మీద ఉన్న రాజకీయ కక్షతో జిల్లా రైతులను మోసం చేయవద్దు అని హితవు పలికారు. ఒకవేళ ప్రభుత్వం సకాలంలో పనులు పూర్తి చేసి ఉంటే, ఈ ఏడాది నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్లలో దాదాపు 45 టీఎంసీల నీటిని నింపుకునే అవకాశం ఉండేదన్నారు.

పనులు చేపట్టే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదు

ప్రాజెక్టు పనులను పడావు పెట్టడంపై నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు భారీ పాదయాత్ర చేయాలని, ముగింపు సభకు కేసీఆర్ ను తీసుకురావాలని మహబూబ్ నగర్ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు కార్యాచరణ ప్రకటించారు. ఈ ప్రజా ప్రతిఘటన తప్పదనే భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి నేడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమీక్ష జరిపారని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమీక్ష కేవలం మొక్కుబడిగా కాకుండా క్షేత్రస్థాయిలో పనులు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతలలో పాడైన రెండు మోటార్లను వెంటనే రిపేర్ చేసి, ఐదు మోటార్లు నడిపించాలని.. అలాగే నార్లాపూర్ - ఏదుల - వట్టెం పనులను పూర్తి చేసి రిజర్వాయర్లు నింపాలని కోరారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.