Let's talk: editor@tmv.in
కేంద్ర సంక్షేమ పథకాల అమలుపై సచివాలయంలో సమీక్ష

కేంద్ర సంక్షేమ పథకాల అమలుపై సచివాలయంలో సమీక్ష

Gaddamidi Naveen
5 మే, 2026

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత సంక్షేమ పథకాలపై కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాంశ్ పంత్ సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌తో కలిసి వివిధ విభాగాల అధికారులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సమావేశంలో అణగారిన వర్గాల సామాజిక–ఆర్థిక అభ్యున్నతికి సంబంధించిన పలు కీలక సంక్షేమ కార్యక్రమాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ విద్యార్థి వేతనాలు, పౌర హక్కుల పరిరక్షణ వ్యవస్థ, ఎస్సీ, బీసీ హాస్టళ్ల నిర్మాణం, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సమగ్ర పునరావాస కార్యక్రమాలు, అలాగే నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ (నమస్తే) పథకం అమలు స్థితిని అధికారులు వివరించారు.

సమావేశంలో మాట్లాడిన కేంద్ర కార్యదర్శి సుధాంశ్ పంత్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న తీరును అభినందించారు. ఇప్పటివరకు గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి మరింత లోతైన స్థాయిలో ప్రయోజనాలు అందేలా ఇంకా మెరుగుదలకు అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సమాజంలోని అణగారిన, బలహీన వర్గాల జీవితాల్లో స్థిరమైన మార్పు తీసుకురావాలంటే నిరంతర కృషి, సమన్వయంతో కూడిన చర్యలు అవసరమని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన పెండింగ్ అంశాలను సానుకూలంగా పరిశీలిస్తామని కేంద్ర కార్యదర్శి హామీ ఇచ్చారు. భవిష్యత్‌లో రాష్ట్రానికి మరింత ఆర్థిక సహకారం అందించే అవకాశాలపై కూడా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దీని ద్వారా పథకాల పరిధి విస్తరించి, మరింత మంది అర్హులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. అదేవిధంగా, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ పేరెంటల్ సపోర్ట్ యాక్ట్ ను ఆయన ప్రగతిశీల సామాజిక రక్షణ చర్యగా అభివర్ణించారు.

రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి

ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ రాష్ట్రంలో వివిధ పథకాల అమలు తీరును పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పథకాల అమలులో ఎదురవుతున్న విధానపరమైన చిక్కులు, కేంద్రం నుంచి అందాల్సిన నిధులు, స్పష్టతపై కేంద్ర కార్యదర్శికి వివరించారు. రాష్ట్రానికి తగిన మద్దతు అందించాలని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ, బీసీ, వికలాంగుల సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కేంద్ర సంక్షేమ పథకాల అమలుపై సచివాలయంలో సమీక్ష - Tholi Paluku