
పల్టీ రాజకీయం.. నితీశ్ సొంతం
నితీశ్‌కుమార్ బీహార్ రాజకీయ క్షేత్రంలో రెండు దశాబ్దాల పాటు సీఎంగా కొనసాగిన నేత. 10 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాయకుడు. కూటములు మారుస్తూ, అనుహ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ అధికారాన్ని చేజిక్కించుకోవడంలో నేర్పరి అయిన నితీశ్ బీహార్ ముఖ్యమంత్రిగా నిష్క్రమించాడు. అయితే ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను దాటుకుంటూ రాజకీయ అడుగులు వేశాడు. సామాజిక న్యాయం కోసం చేపట్టిన మండల్ ఉద్యమం నుంచి ఎదిగిన నాయకుడు, మత రాజకీయాలు చేసే పార్టీతో పొత్తుపెట్టుకుని 2005లో బీహార్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టాడు. అలాగే 2023లో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమికి వ్యవస్థాపక నాయకుడిగా ఉన్న ఆయనే నేడు ఎన్డీఏతో చేతులు కలిపి తన పదవిని బీజేపీకి అప్పగించాడు. ఇలా రాజకీయ వ్యూహాలతో చిత్ర, విచిత్ర విన్యాసాలు చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేశాడు.
బీహార్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన నితీశ్‌కుమార్ తన రాజకీయ జీవితంలో మిశ్రమ వారసత్వాన్ని వదిలి వెళ్లారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ‘న్యాయ్ కే సాథ్ వికాస్’ అనే నినాదంతో బీహార్‌ను ఆధునిక రాష్ట్రంగా తీర్చిదిద్దిన నాయకుడిగా గుర్తింపు పొందాలనుకున్నప్పటికీ, ఆయన రాజకీయ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు చోటుచేసుకున్నాయి. జేడీయూ అధ్యక్షుడిగా కొనసాగుతున్న నితీశ్ కుమార్, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అధికారంలో కొనసాగడానికి ఎక్కువ కాలం బీజేపీ మద్దతుపై ఆధారపడినా, సామాజిక న్యాయం, మతసామరస్యానికి తాను కట్టుబడి ఉన్నానని ఎప్పటికప్పుడు చెప్పేవారు. అయితే విమర్శకులు మాత్రం మండల్ ఉద్యమం నుంచి ఎదిగిన నాయకుడే ఇప్పుడు హిందీ హృదయభూమిలో బీజేపీకి అధికారాన్ని అప్పగించాడని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ ఇటీవల జేడీయూలో చేరిన నేపథ్యంలో, భవిష్యత్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఆయనకు అవకాశం లభించవచ్చనే చర్చలు జరుగుతున్నాయి. దీంతో కుటుంబ రాజకీయాలకు దూరంగా ఉన్న నాయకుడిగా నితీశ్ నిర్మించుకున్న ప్రతిభ కొంత దెబ్బతిన్నదని విశ్లేషకులు అంటున్నారు.
వాజపేయి కాలంలో కీలక పాత్ర
నితీశ్ కుమార్ రాజకీయ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు మాజీ ప్రధాని అటల్ బిహరి వాజ్‌పాయ్ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో పనిచేసిన కాలం నుంచే ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో రైల్వే శాఖను నిర్వహిస్తూ రైల్వే ఆధునీకరణలో ఆసక్తి చూపిన పార్లమెంటేరియన్‌గా ఆయన పేరు తెచ్చుకున్నారు. వాజపేయి కూడా బీహార్‌లో ఆర్జేడీకి ప్రత్యామ్నాయంగా ఎన్డీఏ ముఖచిత్రంగా నితీశ్‌ను ముందుకు తెచ్చారు.
2005లో బీహార్‌కు కొత్త దిశ
2005లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అప్పటివరకు నేరాలు, అవినీతితో పేరుగాంచిన బీహార్ ప్రతిష్ఠను మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ వ్యవస్థను బలోపేతం చేసి రాష్ట్రానికి కొత్త దిశను చూపారని ఆయన విమర్శకులే అంగీకరిస్తారు.
ప్రజాకర్షక పథకాలు
నితీశ్ పాలనలో ప్రజాకర్షక పథకాలు కీలకంగా నిలిచాయి. ముఖ్యంగా పాఠశాల బాలికలకు ఉచిత సైకిళ్లు, యూనిఫారాలు వంటి పథకాలు పెద్ద ఎత్తున ప్రశంసలు పొందాయి. తరువాత కాలంలో 125 యూనిట్ల ఉచిత విద్యుత్, పోటీ పరీక్షల దరఖాస్తు ఫీజు మాఫీ వంటి పథకాలు కూడా అమలు చేశారు. అత్యంత వివాదాస్పదమైన నిర్ణయాల్లో ఒకటి బీహార్‌లో సంపూర్ణ మద్యం నిషేధం అమలు చేయడమే. 2015 అసెంబ్లీ ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనివల్ల అక్రమ మద్యం వ్యాపారం పెరిగిందనే విమర్శలు కూడా వచ్చాయి.
రాజకీయ ‘పల్టీలు’
బీహార్ రాజకీయాల్లో నితీశ్‌కుమార్ పేరు తరచూ ‘రాజకీయ పల్టీలు’ అనే పదంతో కలిసి వినిపిస్తుంది. గత దశాబ్దంలో ఆయన పలుమార్లు కూటములు మార్చడం వల్ల ఈ పేరు వచ్చింది. అధికారంలో కొనసాగడానికి పరిస్థితులకు అనుగుణంగా కూటమి మార్పులు చేసిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది.
2013 – బీజేపీతో విడిపోవడం
నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) చాలా సంవత్సరాలు బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమిలో భాగంగా అధికారంలో ఉంది. కానీ 2013లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీ పేరును ప్రకటించిన తర్వాత నితీశ్ ఆ కూటమి నుంచి బయటకు వచ్చారు. ఆయన సెక్యులర్ రాజకీయాల పేరుతో బీజేపీతో దూరం పెట్టుకున్నారు.
2015 – ఆర్జేడీతో చేతులు కలపడం
2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నితీశ్ కుమార్ తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయిన లాలూ ప్రసాద్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్‌తో కలిసి మహాగఠబంధన్ ఏర్పరిచారు. ఈ కూటమి ఎన్నికల్లో భారీ విజయం సాధించి బీజేపీని అధికారానికి దూరం పెట్టింది.
2017 – మళ్లీ బీజేపీతో కూటమి
అయితే కేవలం రెండు సంవత్సరాలకే రాజకీయ పరిస్థితి మారింది. ఆర్జేడీపై అవినీతి ఆరోపణలు వచ్చాయని చెబుతూ నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అదే రోజు ఆయన మళ్లీ బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎన్డీఏలో చేరారు. ఈ పరిణామం పెద్ద రాజకీయ సంచలనంగా మారింది.
2022 – మరోసారి మహాగఠబంధన్
2022లో నితీశ్ కుమార్ మరోసారి బీజేపీతో సంబంధాలు తెంచుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఆర్జేడీతో కలిసి మహాగఠబంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ మార్పు కూడా దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.
వరుసగా కూటమి మార్పులు
ఈ తరహా రాజకీయ మార్పుల వల్ల ప్రత్యర్థులు నితీశ్ కుమార్‌ను ‘పల్టూ రామ్’ అని విమర్శించడం ప్రారంభించారు. అయితే ఆయన అనుచరులు మాత్రం దీనిని రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలుగా సమర్థిస్తారు.
తగ్గని రాజకీయ ప్రాధాన్యం
అన్ని మార్పుల తర్వాత కూడా నితీశ్ కుమార్ బీహార్ రాజకీయాల్లో కీలక నాయకుడిగానే కొనసాగారు. ముఖ్యంగా కుర్మీ, అత్యంత వెనుకబడిన వర్గాలు, మహాదళిత వర్గాల్లో ఆయనకు బలమైన మద్దతు ఉండటం వల్ల ఏ కూటమికైనా ఆయన అవసరం అయ్యారు. అందుకే బీహార్ రాజకీయాల్లో నితీశ్ కుమార్ పేరు వచ్చినప్పుడు అభివృద్ధి, సామాజిక న్యాయం మాత్రమే కాదు — కూటమి రాజకీయాల్లో అనూహ్య మలుపులు కూడా గుర్తు చేసుకుంటారు.
బలమైన సామాజిక ఆధారం
కుర్మీ కులానికి చెందిన నితీశ్ కుమార్, అత్యంత వెనుకబడిన వర్గాలు, మహాదళిత వర్గాల్లో బలమైన ఓటు బ్యాంక్‌ను నిర్మించుకున్నారు. ఈ కారణంగా బీహార్‌లో అధికారంలోకి రావాలనుకునే ఏ కూటమికైనా ఆయన కీలకంగా మారారు. ఇలా అభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రజాకర్షక పథకాలు ఒక వైపు ఉండగా, రాజకీయ కూటముల మార్పులు మరోవైపు ఉండటంతో నితీశ్ కుమార్ రాజకీయ వారసత్వం మిశ్రమంగా మిగిలిందని విశ్లేషకులు అంటున్నారు.
