

ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికే రేవంత్ కుట్రలు: బీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం చేపట్టిన సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. ఎన్నికల సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతున్నా వాటిని అమలు చేయకపోవడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ అపీసులో మీడియాతో మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కేసీఆర్ నాయకత్వంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని, ఇందుకు సంబంధించిన బిల్లును కేబినెట్‌లో ఆమోదించి, గవర్నర్ క్లియరెన్స్ కూడా తెచ్చుకున్నామని ఆయన గుర్తు చేశారు. కేవలం 'అపాయింటెడ్ డేట్' ప్రకటించి ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉండగా, ప్రస్తుత రేవంత్ సర్కార్ కాలయాపన చేస్తూ కార్మికుల పొట్ట కొడుతోందని ఆయన మండిపడ్డారు.
ప్రజా పాలన అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం, క్షేత్రస్థాయిలో నిరంకుశంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా వికారాబాద్ పరిధిలోని తాండూరులో సమ్మె చేస్తున్న కార్మికులకు టెంట్ సామాన్లు కూడా సరఫరా చేయవద్దని పోలీసులు నోటీసులు జారీ చేయడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని ఆయన అన్నారు. కార్మికులు తమ సమస్యలపై గళం విప్పకుండా పోలీసులను అడ్డుపెట్టుకుని అణచివేయాలని చూడటం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని విమర్శించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ, పోలీసు వ్యవస్థను రాజకీయ స్వార్థానికి వాడుకోవడంపై రాష్ట్ర డీజీపీ తక్షణమే సమాధానం చెప్పాలని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. పోలీసుల లాఠీలకు కార్మికులు భయపడబోరని, తమ హక్కుల సాధన కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.
జనగామ వంటి ప్రాంతాల్లో ఆర్టీసీ డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె చేస్తున్న కార్మికులను బలవంతంగా అడ్డుకుని, భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రైవేట్ వ్యక్తులతో బస్సులు నడిపించడం హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. ఒక్కో బస్సులో ఒక్కో కానిస్టేబుల్‌ను కూర్చోబెట్టి యుద్ధ ప్రాతిపదికన బస్సులు నడపాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. తమ సమ్మెను భగ్నం చేయవద్దని, ప్రైవేట్ వ్యక్తులతో బస్సులు నడిపి తమ పొట్ట కొట్టవద్దని కార్మికులు పోలీసుల కాళ్ల మీద పడి వేడుకుంటున్న దృశ్యాలు రేవంత్ సర్కార్ రాతి గుండెను తెలియజేస్తున్నాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాల వెనుక ఆర్టీసీని క్రమంగా నిర్వీర్యం చేసి ప్రైవేట్ శక్తులకు అప్పగించే భారీ కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రెండున్నరేళ్లుగా మభ్యపెడుతున్న కాంగ్రెస్ సర్కార్ మోసాన్ని కార్మికులు గమనిస్తున్నారని తలసాని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం గురించి నీతులు చెప్పిన నాయకులు, నేడు అధికారం చేతిలోకి రాగానే వారిని రోడ్డున పడేశారని మండిపడ్డారు. "ప్రజా పాలన" ముసుగులో జరుగుతున్నది కేవలం "దగా పాలన" మాత్రమేనని, కార్మికుల ఆవేదన త్వరలోనే ప్రజా ఆగ్రహంగా మారుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే విలీన ప్రక్రియను పూర్తి చేసి, అపాయింటెడ్ డేట్ ప్రకటించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోలు దద్దరిల్లేలా బీఆర్ఎస్ పార్టీ కార్మికులకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఉద్యోగ భద్రత కల్పించే వరకు ఈ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ మొండి వైఖరి వల్ల రాష్ట్రంలో రవాణా వ్యవస్థ స్తంభించి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డిదేనని తలసాని పేర్కొన్నారు. ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడిపిస్తూ సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ఆయన సూచించారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు పోషించిన కీలక పాత్రను మరిచిపోయి, నేడు వారిని శత్రువుల్లా చూడటం కాంగ్రెస్ పార్టీకి తగదని హితవు పలికారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా కాలయాపన చేస్తే, మరో 'సకల జనుల సమ్మె' తప్పదని, అప్పుడు రేవంత్ సర్కార్ పునాదులు కదలడం ఖాయమని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని పునరుద్ఘాటించారు.
కార్మికుల కడుపు మండితే కలిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని తలసాని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన నిరంకుశ ధోరణి వీడి, కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. పోలీసు బలగాలతో ఉద్యమాలను అణచివేయలేరని, చరిత్రలో ఎంతో మంది నియంతలు ఇలాగే విఫలమయ్యారని, ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవడానికి, కార్మికుల హక్కుల రక్షణ కోసం బీఆర్ఎస్ ఏ స్థాయికైనా వెళ్తుందని స్పష్టం చేశారు.
