Let's talk: editor@tmv.in
రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ అహంకారానికి నిదర్శనం: ఎంపీ సంబిత్ పాత్ర

రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ అహంకారానికి నిదర్శనం: ఎంపీ సంబిత్ పాత్ర

Gaddamidi Naveen
2 జులై, 2026

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ని ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అభ్యంతరకరంగా, ఖండించదగినవిగా ఉన్నాయని, ఇవి కాంగ్రెస్ పార్టీ యొక్క అహంకారాన్ని, వారి రాజకీయ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయని ఆయన ఆరోపించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ఒక మీడియా సమావేశంలో ఆయన రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.

ఈ సంద‌ర్భంగా సంబిత్ పాత్ర మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీ జాతీయ అధ్యక్షుడిని రేవంత్ రెడ్డి అవహేళన చేయడానికి ప్రయత్నించారని ధ్వజమెత్తారు. భారతదేశంలోని అతిపెద్ద పార్టీ అధ్యక్షుడైన నితిన్ నబీన్ పేరు కూడా తెలియకపోతే, రేవంత్ రెడ్డి ఇండియన్ పొలిటికల్ సైన్స్ విద్యార్థిగా ఉండటానికి కూడా అనర్హులు. ఒకే ఒక్క కుటుంబానికి బానిసలుగా ఉంటూ, ఇతరులను గౌరవించడం చేతకాని కాంగ్రెస్ సంస్కృతిని సీఎం వ్యాఖ్యలు బయటపెట్టాయని ఆయన విమర్శించారు.

వివాదానికి నేపథ్యం

తెలంగాణ పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మాట్లాడుతూ.. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీనిపై మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన 'రైతు భరోసా' సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

ఇటీవలే ఇక్కడికి ఎవరో నబీన్ అంటా, ఆయన పేరేంటో కూడా నాకు సరిగ్గా తెలియదు..అంటూ వ్యాఖ్యానించిన ఆయన, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం వస్తుందని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్‌లో కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారని, అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీకి 15 సంవత్సరాలు పట్టిందని రేవంత్ రెడ్డి అన్నారు. అక్కడ మమతా బెనర్జీ ఉన్నారని మీ వ్యూహాలు కొంతవరకు పనిచేసి ఉండొచ్చని, కానీ తెలంగాణలో అవి అసలు పనిచేయవని స్పష్టం చేశారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీజేపీని రాజకీయంగా గట్టిగా ఎదుర్కొంటారని, వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ, దానికి నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని నితిన్ నబీన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఇరు పార్టీల నేతల మధ్య రాజకీయ యుద్ధం మరింత ముదిరింది.

ట్యాగ్‌లు
SambitPatraRevanthReddyBJPCongressNitinNabinTelanganaPoliticsPoliticalNewsHyderabadTelanganaBJPvsCongressIndianPoliticsBreakingNews
రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ అహంకారానికి నిదర్శనం: ఎంపీ సంబిత్ పాత్ర - Tholi Paluku