
రేవంత్ వ్యాఖ్యలు రాజకీయ అహంకారానికి నిదర్శనం: ఎన్. రామచందర్ రావు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు బుధవారం తీవ్రస్థాయిలో స్పందించారు. ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు ఆయన యొక్క "రాజకీయ అహంకారానికి", అలాగే రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి పుట్టిన రాజకీయ భయానికి నిదర్శనమని ఆయన ఆరోపించారు.
హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణను 'కాంగ్రెస్ ముక్త్' రాష్ట్రంగా మార్చాలని నితిన్ నబీన్ పిలుపునివ్వడంతోనే రేవంత్ రెడ్డిలో వణుకు మొదలైంది. నితిన్ నబీన్ మూడు రోజుల పర్యటనలో బీజేపీ శ్రేణులలో కనిపించిన అపరిమితమైన ఉత్సాహాన్ని చూసి తట్టుకోలేక, భయంతోనే ముఖ్యమంత్రి నిరాశలో ఇలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
అదే విధంగా, రామచందర్ రావు తన ఎక్స్ పోస్టులో.. అహంకారం కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకుల డీఎన్‌ఏలోనే బలంగా నాటుకుపోయిందని, అందుకే 2011 తర్వాత అధికారంలో ఉన్న ప్రభుత్వంగా కాంగ్రెస్ ఎక్కడా తిరిగి ప్రజల మద్దతుతో గెలవలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. భారతీయ ఓటర్లు పదేపదే తిరస్కరిస్తున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ, దాని నాయకులు తమ అహంకారాన్ని మాత్రం వదిలిపెట్టడం లేదన్నారు. ఇలాంటి భాషను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ అంగీకరించరని. గతంలో అహంకారంతో వ్యవహరించిన ఫామ్‌హౌస్ రాజకీయాలను ప్రజలు ఎలా తిరస్కరించారో, అదే గతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికీ పడుతుందని తెలిపారు. కాంగ్రెస్‌కు ఒకే ఒక్క గుర్తుచేసే మాట.. "మీరు ఎంత బురద చల్లితే, కమలం అంతగా వికసిస్తుందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీనిపై మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన 'రైతు భరోసా' సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీని చిత్తుగా ఓడిస్తుందని స్పష్టం చేశారు.
