Let's talk: editor@tmv.in
రేవంత్ రెడ్డి 'శాడిస్టిక్ ప్లెజర్' సిగ్గుచేటు: కేటీఆర్

రేవంత్ రెడ్డి 'శాడిస్టిక్ ప్లెజర్' సిగ్గుచేటు: కేటీఆర్

Gaddamidi Naveen
30 ఏప్రిల్, 2026

తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత వేడెక్కింది. తనను విమర్శిస్తే తనకు శాడిస్టిక్ ప్లెజర్ (పైశాచిక ఆనందం) కలుగుతుందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. బుధ‌వారం తెలంగాణ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సిగ్గుచేటని, ప్రజల కష్టాలను చూసి ఆనందించడం ఆయన వికృత మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు.

గత రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతుంటే, ముఖ్యమంత్రి ఆ విమర్శలను పరిష్కరించాల్సింది పోయి ఉత్సాహంగా జరుపుకోవడం విచారకరమన్నారు. గురుకుల విద్యార్థుల మరణాల అంశాన్ని ప్రస్తావిస్తూ, సుమారు 140 మంది విద్యార్థుల మృతిపై సీఎం ఎలాంటి బాధను వ్యక్తం చేయలేదా అని ప్రశ్నించారు. అలాగే రైతులకు సంబంధించి పలు సమస్యలను ప్రస్తావించారు. మొక్కజొన్న, జొన్న వరి కొనుగోలు నిలిచిపోయిందని, ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు కేటాయించడం లేదు. ధాన్యం సేకరిస్తే బోనస్ ఇవ్వాల్సి వస్తుందని రోడ్లపై ధాన్యం వర్షానికి తడుస్తూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ అన్నారు. విద్యుత్ సరఫరా అంతరాయం, రైతు బంధు సకాలంలో అందకపోవడం వంటి అంశాలపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశపెట్టి, బీఆర్ఎస్ ప్రభుత్వం విజయవంతంగా కొనసాగించిన ఈ పథకాన్ని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. బకాయిల కోసం కాలేజీలు సర్టిఫికేట్లు ఆపేస్తున్నాయని, దీనివల్ల పేద విద్యార్థులు నష్టపోతున్నారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవచ్చని ఇచ్చిన అనుమతి విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతోందని విమర్శించారు.

బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా గత 25 ఏళ్లుగా ప్రజల పక్షానే పోరాడుతోందని, ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆపేది లేదని ఆయ‌న పేర్కొన్నారు. ఈ సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.

రేవంత్ రెడ్డి 'శాడిస్టిక్ ప్లెజర్' సిగ్గుచేటు: కేటీఆర్ - Tholi Paluku