
దక్షిణాది ఐక్యతలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర.. ప్రియాంక గాంధీ ప్రశంసలు
లోక్‌సభలో నియోజకవర్గాల పునర్విభజన ( డీలిమిటేషన్) బిల్లును అడ్డుకోవడంలో, దక్షిణాది రాష్ట్రాల గొంతుకను వినిపించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పోషించిన పాత్రపై ఏఐసీసీ నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ ప్రశంసల జల్లు కురిపించారు. శనివారం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెతో భేటీ అయ్యారు.
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఓటమిలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ప్రియాంక గాంధీ కొనియాడారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది, ఈశాన్య, చిన్న రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని బలహీనపరిచేలా ఉన్న ఈ బిల్లును వ్యతిరేకించడంలో రేవంత్ పట్టుదలగా వ్యవహరించారని ఆమె అభినందించారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల వెనుక ఉన్న అసలు ఉద్దేశం మహిళా సాధికారత కాదని, వివాదాస్పద పునర్విభజన అజెండాను రుద్దడమేనని ప్రియాంక గాంధీ ఎండగట్టారని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆమె చేసిన పోరాటం దేశ భవిష్యత్తును కాపాడిందని కొనియాడారు.
నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయాన్ని ఎండగట్టడమే కాకుండా, కేంద్రం ప్రతిపాదించిన నమూనాలోని లోపాలను రేవంత్ రెడ్డి సమర్థవంతంగా వివరించారు. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఆయన సూచించిన తీరును ప్రియాంక అభినందించారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల నేతృత్వంలో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడంలో ప్రియాంక గాంధీ అందించిన మార్గదర్శకత్వానికి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజల తరపున ఆమెకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ రాజ్యాంగ సవరణ అప్రజాస్వామికమని, దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలను రాజకీయంగా నిర్వీర్యం చేసే ప్రయత్నమని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రియాంక గాంధీ తనను అభినందించడం మరింత స్ఫూర్తిని ఇచ్చిందని, దేశ సమగ్రత కోసం తన పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
