Let's talk: editor@tmv.in
డీలిమిటేషన్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అజ్ఞానానికి నిదర్శనం: ఎన్. రామచందర్ రావు

డీలిమిటేషన్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అజ్ఞానానికి నిదర్శనం: ఎన్. రామచందర్ రావు

Gaddamidi Naveen
15 ఏప్రిల్, 2026

రాష్ట్రంలో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై సీఎం చేసిన వ్యాఖ్యలు అసత్యాలపై ఆధారపడి ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని బయటపెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీకి నైతిక హక్కు లేదని రామచందర్ రావు విమర్శించారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించినప్పటికీ మహిళా సాధికారత కోసం అవసరమైన చట్టాలను తీసుకురావడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. షా బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును పక్కనపెట్టి ఓటు బ్యాంక్ రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చిన చరిత్ర ఉందని ఆరోపించారు. ట్రిపుల్ తలాక్ రద్దు విషయంలో కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా వ్యవహరించిందని గుర్తు చేశారు.

యూపీఏ హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీజేపీ మద్దతు ఇవ్వలేదన్న సీఎం వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆ సమయంలో బీజేపీ, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు పూర్తి మద్దతు తెలిపినా, కాంగ్రెస్ మిత్రపక్షాలైన ఎస్పీ, ఆర్జేడీలే బిల్లును అడ్డుకున్నాయని ఆయ‌న అన్నారు. కేంద్ర కేబినెట్‌లో దక్షిణ భారత రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేదన్న ఆరోపణలను కూడా ఆయన తిరస్కరించారు.కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్. జైశంకర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి నేతలు దక్షిణాది వారేనని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయవద్దని సీఎం ను హెచ్చరించారు.

నియోజకవర్గాల పునర్విభజనపై ఇంకా ఎలాంటి స్పష్టత రాకముందే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోందని విమర్శించారు. జీఎస్డీపీ ఆధారంగా పునర్విభజన చేయాలని సీఎం వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు.

అంబేద్కర్ పట్ల కాంగ్రెస్ వైఖరి

బాబాసాహెబ్ అంబేద్కర్‌ను కాంగ్రెస్ అడుగడుగునా అవమానించిందని రామచందర్ రావు ఆరోపించారు. 1952, 1954 ఎన్నికల్లో ఆయనను ఓడించడమే కాకుండా, నెహ్రూ స్వయంగా ఆయనను నిందిస్తూ లేఖలు రాశారని గుర్తు చేశారు. 1990లో బీజేపీ మద్దతుతో నడిచిన ప్రభుత్వమే అంబేద్కర్‌కు 'భారతరత్న' ప్రకటించిందని, కాంగ్రెస్ నేతలు మాత్రం తమకు తామే ఆ అవార్డులు ఇచ్చుకున్నారని విమర్శించారు. కేవలం అవకాశవాద రాజకీయాల కోసమే కాంగ్రెస్ ఇప్పుడు కొత్త నాటకాలు ఆడుతోందని, ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.