Let's talk: editor@tmv.in
పోక్సో నిందితుడిని తొమ్మిది రోజులు కాపాడింది రేవంత్ రెడ్డినే: కేటీఆర్

పోక్సో నిందితుడిని తొమ్మిది రోజులు కాపాడింది రేవంత్ రెడ్డినే: కేటీఆర్

Gaddamidi Naveen
23 మే, 2026

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మైనర్ బాలికకు అన్యాయం జరిగితే నిందితుడిని తొమ్మిది రోజుల పాటు దాచిపెట్టి కాపాడిన నేరం ముమ్మాటికీ హోంమంత్రి బాధ్యతల్లో ఉన్న రేవంత్ రెడ్డిదేనని ఆయన ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి గురువారం చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు.

మీడియాతో మాట్లాడిన కేటీఆర్. నిందితుడిని తొమ్మిది రోజుల పాటు కాపాడింది రేవంత్ రెడ్డే. ఆయన ఎవరి ఆదేశాల మేరకు అలా చేశారో నాకు తెలియదు అని పేర్కొంటూ పోలీసుల ఆలస్యపు చర్యలపై మండిపడ్డారు. ఇదే స్థానంలో ఒక సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి ఉంటే పోలీసులు ఇంతే నిమ్మళంగా ఉండేవారా అని ప్రశ్నించారు. అదే సామాన్యుడి బిడ్డ అయితే 24 గంటల్లోనే పోలీస్ స్టేషన్‌కు తరలించి, నిజాలు కక్కించేవారని విమర్శించారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక ఆడబిడ్డకు అన్యాయం చేసిన వెధవ ఎవరో సమాధానం చెప్పాలని కేటీఆర్ సవాలు విసిరారు. బాధితురాలు తల్లిదండ్రులతో పోలీస్ స్టేషన్‌కు వెళ్తే అర్ధరాత్రి వరకు నిలబెట్టి తీవ్ర ఆవేదనకు గురిచేశారని.. చివరికి హైకోర్టు బెయిల్ ఇవ్వనని తెగేసి చెప్పడం, ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవ్వడంతోనే దిక్కులేని పరిస్థితుల్లో నిందితుడిని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ప్రధానమంత్రి పర్యటన వల్ల పోలీసులు బిజీగా ఉన్నారంటూ రేవంత్ రెడ్డి అడ్డగోలు సాకులు చెప్పడం సిగ్గుచేటన్నారు.

బండి సంజయ్‌కు, రేవంత్ రెడ్డికి ఉన్న వ్యక్తిగత అనుబంధం వల్లనే ఇద్దరు కలిసి నిందితుణ్ణి కాపాడారని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి సన్నిహితుడికి చెందిన ఒక ఆసుపత్రిలోనే నిందితుడు తొమ్మిది రోజులు తలదాచుకున్నాడనే వార్తలు వస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలన్నారు. పైగా బాధిత కుటుంబంపైనే ‘హనీ ట్రాప్’ అంటూ కౌంటర్ కేసు పెట్టించి కుట్రలు చేశారని మండిపడ్డారు.

ఒకవైపు తన కొడుక్కు, తనకు సంబంధం లేదని కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకున్న బండి సంజయ్.. తిరిగి తానే పోలీసులకు అప్పగించానని అనడం ఏంటి? అని కేటీఆర్ ప్రశ్నించారు. బండి సంజయ్ మాదిరిగా తన కొడుకుకు, తండ్రికి సంబంధం లేదని చెప్పుకునే పిరికివాణ్ణి తాను కాదని.. "మా నాన్న పేరు కేసీఆర్, నా కొడుకు పేరు హిమాన్షు" అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు.

'బేటా బచావో, బేటా భగావో'

ప్రధాని మోడీ 'బేటీ బచావో, బేటీ పఢావో' అని నినాదాలు ఇస్తుంటే, ఇక్కడ మాత్రం 'బేటా బచావో, బేటా భగావో' అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా కొనసాగితే ఈ కేసులో నిష్పక్షపాత విచారణ ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. స్వయంగా ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి మీడియా సంస్థల కార్యాలయాలకు ఫోన్లు చేసి, కాళ్లా వేళ్లా పట్టుకొని ఈ పోక్సో కేసు వార్తలు రాకుండా ఆపింది వాస్తవం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ కేసులో ప్రభుత్వాన్ని, మీడియాను అలర్ట్ చేస్తూ నిలదీసిన పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ను ఆయన అభినందించారు. ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు.

కాగా, పోక్సో కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు బండి సాయి భగీరథ్‌కు కోర్టు మే 29 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. నిందితుడి తరపు న్యాయవాది కరుణాసాగర్ స్పందిస్తూ.. భగీరథ్ పోలీసుల ముందుకు వచ్చి లొంగిపోయాడని, విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాడని తెలిపారు. న్యాయ ప్రక్రియ ద్వారా తన క్లయింట్ నిర్దోషిగా బయటకు వస్తాడని ధీమా వ్యక్తం చేశారు.

పంట కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి

అనంత‌రం రాష్ట్రంలో పంట కొనుగోళ్ల సంక్షోభం తీవ్రంగా ఉందని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోకుండా అబద్ధపు లెక్కలు చెబుతోందని ఆయన మండిపడ్డారు. పంట కొనుగోళ్లపై లెక్కలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చెబుతున్నట్లుగా 80 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని నిరూపిస్తే ఏ శిక్షకైనా తాము సిద్ధమని కేటీఆర్ సవాలు విసిరారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో 30 శాతం కొనుగోళ్లు కూడా పూర్తి కాలేదని ఆయన ఆరోపించారు. మంత్రులు, సీఎం భిన్నమైన గణాంకాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.

రైతులు పంటలను కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లినా కాంటా వేయడం లేదని, వేయిన చోట్ల భారీగా తరుగు తీసి దోపిడీ జరుగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. గన్నీ బ్యాగులు, సుతలిదారం వంటి మౌలిక సదుపాయాల కొరత ఉందని, ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలకు దిగుతున్నారని, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో కూడా నిరసనలు జరుగుతున్నాయని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వం రైతు మరణాలపై సమాచారం ఉన్నా నిరాకరిస్తోందని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా, రైతుబంధు, రుణమాఫీతో పాటు పంట అమ్మకాల్లో కూడా సమస్యలు పెరిగాయని కేటీఆర్ విమర్శించారు. కొనుగోళ్లు ఆలస్యం చేస్తే రైతులు తక్కువ ధరలకు దళారులకు అమ్ముకోవాల్సి వస్తుందని అన్నారు. నేడు జరిగే కేబినెట్ సమావేశంలో పంట కొనుగోళ్ల సంక్షోభాన్ని ప్రధాన అజెండాగా చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే క్షేత్రస్థాయిలో ఒత్తిడి పెంచుతామని హెచ్చరించారు. ప్రభుత్వం చెప్పేది నిజమైతే ఏ కొనుగోలు కేంద్రానికైనా తాము వస్తామని, 80 శాతం కొనుగోళ్లు జరిగాయని నిరూపించాలని సవాలు విసిరారు. రైతుల కోసం పంతాలు విడిచి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.