
సొంత పార్టీ నేతలకే వెన్నుపోటు పొడిచే వ్యక్తి రేవంత్ రెడ్డి: కేటీఆర్
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, వర్గపోరు కారణంగానే కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురికావడం వెనుక రేవంత్ రెడ్డి అంతర్గత వెన్నుపోటు, రాజకీయాలే కారణమని ఆయన ఆరోపించారు.
ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డిని తన సొంత పార్టీ సభ్యులకే వెన్నుపోటు పొడిచే వ్యక్తిగా అభివర్ణించారు. రేవంత్ రెడ్డికి సంబంధించిన భూ దందాలు, కాంట్రాక్టుల అవినీతిపై మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ హైకమాండ్‌కు నివేదించారనే కక్షతోనే, ఆమెను లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్‌లో తప్పుడు కేసు బనాయించారని కేటీఆర్ ఆరోపించారు. అంతేకాకుండా, ఆమె రాజ్యసభ నామినేషన్‌ను అడ్డుకునేందుకు ఆ తప్పుడు కేసు వివరాలను రేవంత్ రెడ్డి స్వయంగా బీజేపీ నేతలతో పంచుకున్నారని మండిపడ్డారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉంటూ హిట్లర్‌ను తన ఆదర్శంగా ప్రకటించుకున్న రేవంత్ రెడ్డి సీఎం సీట్లో కూర్చోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వ రెండున్నరేళ్ల పరిపాలనను ఒక ‘అట్టర్ ఫ్లాప్’ సినిమాతో కేటీఆర్ పోల్చారు. ఐదేళ్ల పదవీకాలంలో సగం పూర్తయినా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. సినిమా ట్రైలర్ చూస్తేనే అది హిట్టా, ఫ్లాపా అనేది తెలిసిపోతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్వెల్ నాటికే పూర్తిగా ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. గత రెండున్నరేళ్లలో ఒక్కటంటే ఒక్క ప్రధాన హామీని కూడా నెరవేర్చలేకపోయిందని ధ్వజమెత్తారు.
మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించిన కేటీఆర్, ఇప్పటివరకు 4,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ. 4,000 నిరుద్యోగ భృతిని కూడా ఎగ్గొట్టారని మండిపడ్డారు. ఇక కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సవాల్ చేస్తూ.. ఆ మాట నిజమని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకోవడానికి, రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి లబ్ధిదారురాలికి రూ. 1.25 లక్షల చొప్పున బాకీ పడిందని లెక్కగట్టారు.
ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక ఖాయం
ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాస్తూ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారని, అందువల్ల ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నిక రావడం ఖాయమని కేటీఆర్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ తరహాలోనే ఓటర్ల జాబితాలో కాంగ్రెస్ పార్టీ చేసే అక్రమాలపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. జూన్ 25 నుంచి జూలై 31 వరకు జరిగే సమగ్ర కుటుంబ సర్వే (సర్ - ఓటర్ల సవరణ ప్రక్రియ) లో బూత్ లెవెల్ ఏజెంట్లు చురుగ్గా పాల్గొనాలని, అలాగే డిజిటల్ పార్టీ సభ్యత్వ నమోదును రికార్డు స్థాయిలో చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ విజయాల గుర్తింపు
గత 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఒక్క పెద్ద ఆసుపత్రిని కూడా నిర్మించలేకపోయిందని, కానీ కేసీఆర్ ప్రభుత్వం కేవలం పదేళ్లలోనే నాలుగు ప్రతిష్టాత్మక టిమ్స్ ఆసుపత్రులు, 350 బస్తి దవాఖానాలు నిర్మించిందని గుర్తుచేశారు. క్యాన్సర్ రోగుల సహాయకుల కోసం ధర్మశాలల నిర్మాణాన్ని సులభతరం చేశామన్నారు. పేదల ఆకలి తీర్చిన ‘అన్నపూర్ణ’ ఉచిత భోజన పథకం పేరును కాంగ్రెస్ మార్చడాన్ని ఆయన తప్పుబట్టారు.
గతంలో నీటి ట్యాంకర్ల కోసం అల్లాడిన పరిస్థితులను మార్చి, తమ ప్రభుత్వం 24 గంటల విద్యుత్, ఉచిత తాగునీరు అందించిందని పేర్కొన్నారు. 'హైడ్రా' పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్న కాంగ్రెస్ చర్యలను తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ ప్రభుత్వం జీవో నెం. 50 ద్వారా 2.50 లక్షల కుటుంబాలకు భూమి హక్కులు (పట్టాలు) కల్పిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఒక్క ఇటుక కూడా వేయలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు అప్పుడే కేసీఆర్ సుపరిపాలనను కోరుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘనవిజయం సాధించడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
