Let's talk: editor@tmv.in
రేవంత్ రెడ్డికి కృష్ణా నీటి వినియోగంపై కనీస అవగాహన లేదు: మాజీ మంత్రి హరీష్ రావు

రేవంత్ రెడ్డికి కృష్ణా నీటి వినియోగంపై కనీస అవగాహన లేదు: మాజీ మంత్రి హరీష్ రావు

Gaddamidi Naveen
6 జూన్, 2026

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన ప్రభుత్వ పాలనలో కృష్ణా నీటి వినియోగం ఎంత జరిగిందనే కనీస అవగాహన లేకపోవడం పాలమూరుకే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి దురదృష్టకరమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు తన ఎక్స్ (ట్విట్టర్) వేదిక ద్వారా మండిపడ్డారు. ఇలాంటి అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల తెలంగాణ జల హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా దీనిపై అవగాహన లేదా? అని ప్రశ్నించిన హరీష్ రావు, ప్రభుత్వం రాసిన అధికారిక లేఖల్లో ఏముందో సీఎం, మంత్రి ఇద్దరికీ తెలియదా? అని నిలదీశారు. ప్రభుత్వం వచ్చి 30 నెలలు దాటినా ఇరిగేషన్ అంశాలపై ఇంకెప్పుడు అవగాహన పెంచుకుంటారని ఆయన ప్రశ్నించారు. మే 2, 2026 నాడు తెలంగాణ ఈఎన్సీ జనరల్ కృష్ణా బోర్డుకు రాసిన అధికారిక లేఖను ఆయన ఈ సందర్భంగా జత చేశారు. ఆ లేఖ ప్రకారం.. కృష్ణా నీటిలో ఆంధ్రప్రదేశ్ 74.23 శాతం వాటాను వినియోగించుకోగా, తెలంగాణ కేవలం 25.77 శాతం మాత్రమే వాడుకుందనేది నిజమని, తాను రేవంత్ రెడ్డిలా ఆధారాలు లేకుండా అబద్ధాలు మాట్లాడనని స్పష్టం చేశారు.

పాలమూరు ప్రాజెక్టుకు కాంగ్రెస్ ద్రోహం

పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి, తన రెండున్నరేళ్ల పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చేసింది గుండు సున్నా అని హరీష్ రావు విమర్శించారు. 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1,226 గ్రామాలకు తాగునీరు అందించే చారిత్రక పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా పాలమూరుకు కాంగ్రెస్ ద్రోహం చేస్తోందని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే సీఎం అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. గతంలో ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేసులు వేయించి పనులను అడ్డుకున్నది రేవంత్ రెడ్డి, నాటి కాంగ్రెస్ పార్టీయేనని, వాటన్నింటినీ ఎదుర్కొని బీఆర్ఎస్ ప్రభుత్వం పనులను పరుగులు పెట్టించిందని గుర్తుచేశారు.

భూసేకరణపై సవాల్ – బీఆర్ఎస్ సాధించిన ప్రగతి

భూసేకరణపై సీఎం వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్న హరీష్ రావు, నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులను అధిగమించి 27,191 ఎకరాల భూసేకరణ చేసిందని తెలిపారు. కాంగ్రెస్ తన రెండున్నరేళ్ల పాలనలో ఎన్ని ఎకరాలు సేకరించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సగం పాలనా కాలం వృథా చేసి, ఇప్పుడు కుంభకర్ణ నిద్ర లేచి భూసేకరణ ప్రతిపాదనలు అనడం సిగ్గుచేటన్నారు.

టీడీపీ, కాంగ్రెస్ పాలనలో వలసలకు నిలయమైన పాలమూరు తలరాతను మార్చి, 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ దేనని హరీష్ రావు కొనియాడారు. కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల ఆయకట్టును 27 వేల ఎకరాల నుంచి 6.5 లక్షల ఎకరాలకు పెంచామని, ఆర్‌డీఎస్ రైతులకు తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా నీరందించామని వివరించారు. ఈ 30 నెలల్లో తట్టెడు మట్టి తీయని రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా అబద్ధాల పాలన పక్కనబెట్టి వాస్తవాలు తెలుసుకోవాలని హరీష్ రావు హితవు పలికారు.