Let's talk: editor@tmv.in
రేవంత్ ప్రభుత్వం తెలంగాణ జలహక్కులను తాకట్టు పెడుతోంది: హరీష్ రావు

రేవంత్ ప్రభుత్వం తెలంగాణ జలహక్కులను తాకట్టు పెడుతోంది: హరీష్ రావు

Gaddamidi Naveen
28 జూన్, 2026

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర జలహక్కులను రాజకీయ స్వార్థం కోసం తాకట్టు పెడుతున్నారని, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో తెలంగాణ ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు.

కర్ణాటక ప్రభుత్వం తుంగభద్రకు దిగువన 35 టీఎంసీల సామర్థ్యంతో నవేలి రిజర్వాయర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుండ్రేవుల ప్రాజెక్టును నిర్మించేందుకు ముందుకు వస్తున్నాయని, ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా మొత్తం 55 టీఎంసీల నీటిని నిల్వ చేయడం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని హరీష్ రావు అన్నారు. గుండ్రేవుల ప్రాజెక్టుకు 2013 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం అనుమతి లేదని, అయినప్పటికీ దానిని మళ్లీ తెరపైకి తీసుకువస్తున్నారని ఆరోపించారు.

ముఖ్యమంత్రుల సమావేశానికి తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఇంజనీర్లను అనుమతించకుండా బయటే ఉంచారని, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి కాంతారావు సమక్షంలో జరిగిన సమావేశంలో ఏ ఒప్పందం కుదిరిందో ప్రభుత్వం వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం కురుడి, చిక్కలపర్వి, చుక్కలమంచి ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా బ్యారేజీలు నిర్మిస్తోందని, ఏడాదికిపైగా పనులు కొనసాగుతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి గానీ, కృష్ణా నది యాజమాన్య బోర్డుకు గానీ అభ్యంతరాలు తెలియజేయలేదని ఆరోపించారు. దీంతో భవిష్యత్తులో ఆర్డీఎస్, శ్రీశైలం ప్రాజెక్టులకు నీటి ప్రవాహం తగ్గి, కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయ‌న పేర్కొన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గోదావరిలో 383 టీఎంసీలకు అనుమతులు సాధించామని, మొత్తం 830 టీఎంసీల ప్రాజెక్టులకు క్లియరెన్స్ తెచ్చామని హరీష్ రావు తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో ఒక్క టీఎంసీకి కూడా కొత్త అనుమతి సాధించలేదని విమర్శించారు. సమ్మక్క సాగర్, వాద్ర, ఎల్లంపల్లి వంటి పెండింగ్ ప్రాజెక్టుల డీపీఆర్‌లు నిర్లక్ష్యంతో వెనక్కి వచ్చాయని ఆరోపించారు.

నదుల అనుసంధానం పేరుతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణ హక్కులను బలిపెడుతున్నారని, సమ్మక్క సాగర్ ప్రాజెక్టు భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అలాగే ఆర్డీఎస్‌కు రావాల్సిన 15.9 టీఎంసీల నీటి వాటాపై కేంద్రం నుంచి హామీ తీసుకున్నారా, కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని కోరారు. మూడు రాష్ట్రాల సమావేశంలో జరిగిన చర్చలను శాసనసభలో ఉంచి అన్ని రాజకీయ పార్టీలతో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు
HarishRaoBRSTelanganaRevanthReddyTelanganaPoliticsWaterRightsKrishnaRiverGodavariTungabhadraIrrigationRDSSammakkaSagar
రేవంత్ ప్రభుత్వం తెలంగాణ జలహక్కులను తాకట్టు పెడుతోంది: హరీష్ రావు - Tholi Paluku