Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య

హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య

Gaddamidi Naveen
9 మే, 2026

న‌గ‌రంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య తనూజ రే (62) హత్యకు గురైన ఘటన నగరంలో కలకలం రేపింది. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్ నగర్ ప్రాంతంలో జరిగింది.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి తనూజను హత్య చేసినట్లు భావిస్తున్నారు. బహుళ అంతస్తుల భవనంలోని మొదటి అంతస్తులో ఆమె మృతదేహం లభ్యమైంది. ఘటన సమయంలో ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో డీజీ ర్యాంక్ అధికారిగా పదవీ విరమణ చేసిన వినయ్ రంజన్ రే ప్రస్తుతం నగరంలో లేరు. ఘటన జరిగిన సమయంలో ఆయన పిల్లలు ఇంటి పై అంతస్తులో ఉండగా, మొదటి అంతస్తులో ఉన్న తనూజను దుండగులు ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం ఇంట్లోని విలువైన వస్తువులతో పరారయ్యారు. దోచుకెళ్లిన వస్తువుల వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

నేపాల్ గ్యాంగ్ హస్తం?

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రాథమిక విచారణ వివరాలను వెల్లడించారు. ఈ హత్య వెనుక నేపాలీ గ్యాంగ్ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నామని ఆయన తెలిపారు. ఘటనకు సంబంధించిన కొన్ని కీలక ఆధారాలు లభించాయని, వాటి ఆధారంగా ప్రత్యేక పోలీసు బృందాలు దర్యాప్తును వేగవంతం చేశాయని చెప్పారు. ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ మహిళా పనిమనిషి సహాయంతోనే ఈ నేరం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఆయ‌న‌ ధీమా వ్యక్తం చేశారు.

నగర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీపీ సజ్జనార్ భరోసా ఇచ్చారు. అయితే, తమ ఇళ్లలో నేపాల్‌కు చెందిన వారిని పనిలో పెట్టుకున్న యజమానులు అప్రమత్తంగా ఉండాలని, వారి కదలికలపై నిఘా ఉంచాలని ఆయన సూచించారు. ఈ కేసు దర్యాప్తు కోసం పలువురు సీనియర్ పోలీసు అధికారులు రంగంలోకి దిగి అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.