
గోల్డెన్ అవర్‌లో స్పందించండి.. ప్రాణదాతలుగా నిలవండి: సీపీ సజ్జనార్
రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకోవడంలో సామాజిక బాధ్యతను గుర్తుచేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక సందేశాన్ని ఇచ్చారు. ఆయన ఎక్స్ వేదికగా విడుదల చేసిన వీడియోలో "ప్రాణం కంటే ఏదీ మిన్న కాదు" అని పేర్కొంటూ, ప్రమాదం జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ 'రహ్-వీర్'లుగా మారి ప్రాణదాతలుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే భయపడి వెనకడుగు వేయకుండా, 'గోల్డెన్ అవర్' (ప్రమాదం జరిగిన మొదటి గంట) లో బాధితులకు సాయం చేయాలని సీపీ కోరారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'రహ్-వీర్' పథకం గురించి వివరించారు. ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి రూ. 25,000 నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం అందజేస్తారు. జాతీయ స్థాయిలో ఎంపికైన ఉత్తమ సేవకులకు రూ. 1,00,000 నగదు పురస్కారం లభిస్తుంది. సాయం చేసే వారికి పోలీసులు లేదా కోర్టుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వివరాలు చెప్పమని ఎవరూ ఒత్తిడి చేయరని, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
వీడియోలు తీస్తూ సమయం వృథా చేయకండి..
ప్రమాదం జరిగినప్పుడు ఫోన్లతో వీడియోలు తీస్తూ కాలయాపన చేయవద్దని, ఆ సమయాన్ని బాధితులను కాపాడటానికి ఉపయోగించాలని సజ్జనార్ సూచించారు. ఈ సమయంలో మీరు చేసే చిన్న సహాయం కూడా ఒక ప్రాణాన్ని రక్షించగలదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా 'అరైవ్ అలైవ్' కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.రహదారి మరణాలు లేని సమాజాన్ని నిర్మించడంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన ఆకాంక్షించారు.
