Let's talk: editor@tmv.in
సాయిబాబా భక్తుల మనోభావాలకు గౌరవం.. దుష్ప్రచారాన్ని నమ్మొద్దు: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

సాయిబాబా భక్తుల మనోభావాలకు గౌరవం.. దుష్ప్రచారాన్ని నమ్మొద్దు: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

Gaddamidi Naveen
25 జూన్, 2026

సాయిబాబా ఆలయాలపై తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యల అసలు ఉద్దేశాన్ని పక్కనబెట్టి కొన్ని వర్గాలు, మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన ఖండించారు.

తాను వ్యక్తిగతంగా సాయిబాబా భక్తుడినని, ప్రతిరోజూ తన పూజా మందిరంలో ఇతర దేవతలతో పాటు షిర్డీ సాయిబాబాను భక్తిశ్రద్ధలతో ఆరాధించిన తర్వాతే దినచర్యను ప్రారంభిస్తానని మంత్రి తెలిపారు. తన వ్యాఖ్యల వల్ల ఏ భక్తుడైనా బాధపడి ఉంటే హృదయపూర్వకంగా క్షమాపణ కోరుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానాలు ఎవరిపైనా వివక్ష చూపవని స్పష్టం చేశారు. సాయిబాబా పట్ల కోట్లాది మంది భక్తులకు ఉన్న విశ్వాసాన్ని ప్రభుత్వం పూర్తిగా గౌరవిస్తుందని పేర్కొన్నారు. సాయిబాబా ఆలయాల్లో హిందూ సంప్రదాయాలకు అనుగుణంగానే పూజలు జరుగుతున్నాయని గుర్తుచేశారు.

టీటీడీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 5,000 భజన మందిరాల కార్యక్రమం సనాతన హిందూ ధర్మ పరిరక్షణ, ప్రచారం, గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ దేవాలయాల అభివృద్ధి లక్ష్యాలతో కొనసాగుతోందని వివరించారు. ఈ పథకానికి సంబంధించిన నిధుల కేటాయింపు శ్రీవాణి ట్రస్టు నిబంధనలు, మార్గదర్శకాలు, పరిపాలనా విధానాల ప్రకారమే జరుగుతోందని చెప్పారు. సాయిబాబా ఆలయాలకు ఈ పథకం కింద నిధులు అందకపోవడాన్ని భక్తుల విశ్వాసాలపై అవమానంగా చూడకూడదని మంత్రి స్పష్టం చేశారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, పరమశివుడు, అమ్మవారు, ఆంజనేయస్వామి, సాయిబాబా ఇలా సమాజంలో ప్రజలకున్న ఏ ఆరాధనా రూపాన్ని ప్రభుత్వం కించపరచదని, ప్రతి భక్తుని మనోభావాలను గౌరవించడమే తమ విధానమని మంత్రి స్పష్టం చేశారు. వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ఎవరూ నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు
AnamRamanarayanaReddySaiBabaShirdiSaiBabaSaiBabaDevoteesAndhraPradeshAPPoliticsTTDDevasthanamSanatanaDharmaHinduTemplesEndowmentsDepartment
సాయిబాబా భక్తుల మనోభావాలకు గౌరవం.. దుష్ప్రచారాన్ని నమ్మొద్దు: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి - Tholi Paluku