
తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభం జూన్ 15కు వాయిదా
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. ఈనెల 12వ తేదీకి బదులు 15న పునః ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వేసవి సెలవుల అనంతరం 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, జూన్ 13 రెండో శనివారం, జూన్ 14 ఆదివారం కావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు అనుకూలంగా పాఠశాలల ప్రారంభాన్ని సోమవారం నుంచి నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించారు.
ఈనెల 12వ తేదీన సెలవు ఇచ్చినందున విద్యా సంవత్సరం నష్టపోకుండా జులై 11న రాబోయే రెండో శనివారాన్ని సాధారణ పనిదినంగా నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు, సంబంధిత విభాగాలు ఈ ఆదేశాలను అమలు చేయాలని సూచించారు.ఈ తాజా నిర్ణయంతో విద్యార్థులకు మరో మూడు రోజులు అదనంగా సెలవులు లభించినట్లయింది.
