

అంతిమ దశ రోగులకు ఊరట.. ఏపీలో కారుణ్య మరణాల అమలుకు మార్గదర్శకాలు
నయం కాని వ్యాధులతో బాధపడుతూ జీవనాధార పరికరాలపై చికిత్స పొందుతున్న రోగుల విషయంలో కారుణ్యమరణం (ప్యాసివ్ యూథనేషియా) అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన ఈ విధివిధానాలకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు. నయం కాని వ్యాధులతో తీవ్ర వేదన అనుభవిస్తున్న రోగులకు గౌరవప్రదమైన అంతిమ దశ వైద్య సంరక్షణ అందించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం వెల్లడించింది.
ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, చికిత్స వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోయినా కేవలం యంత్రాల సహాయంతో ప్రాణాలను కొనసాగిస్తున్న రోగుల విషయంలో కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చే ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా రూపొందించారు. అమలులో ఎలాంటి దుర్వినియోగం జరగకుండా పలు స్థాయిల్లో వైద్య, పరిపాలనా, న్యాయపరమైన పర్యవేక్షణను తప్పనిసరి చేశారు.
'అడ్వాన్స్ డైరెక్టివ్' తప్పనిసరి
ఈ విధానంలో అత్యంత కీలకమైన అంశం రోగి ముందుగానే ఇచ్చే 'అడ్వాన్స్ డైరెక్టివ్' (ముందస్తు వైద్య ఆదేశ పత్రం). తాను భవిష్యత్తులో నిర్ణయం తీసుకోలేని పరిస్థితి వస్తే, తన తరఫున వైద్య చికిత్సపై నిర్ణయం తీసుకునే సంరక్షకుడు (గార్డియన్) ఎవరో ఈ పత్రంలో స్పష్టంగా పేర్కొనాలి. ఈ పత్రాన్ని నోటరీ లేదా గెజిటెడ్ అధికారి ధృవీకరించాల్సి ఉంటుంది. దీంతో రోగి అభీష్టం, కుటుంబ సభ్యుల పాత్ర రెండింటికీ చట్టబద్ధమైన గుర్తింపు లభిస్తుంది.
రెండు వైద్య బోర్డుల పరిశీలన
రోగి పరిస్థితి పూర్తిగా కోలుకునే అవకాశాలు లేవని చికిత్స అందిస్తున్న వైద్యులు భావించినప్పుడు, ముందుగా కనీసం ఐదేళ్ల అనుభవం కలిగిన మరో ఇద్దరు వైద్యులతో కలిసి ప్రాథమిక వైద్య బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ బోర్డు 48 గంటల్లో రోగి పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి చికిత్స కొనసాగించడం వల్ల ప్రయోజనం ఉందా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటుంది.
ప్రాథమిక బోర్డు చికిత్స కొనసాగించడం వ్యర్థమని నిర్ధారిస్తే, వెంటనే ద్వితీయ వైద్య బోర్డు ఏర్పాటు చేయాలి. ఇందులో రోగికి చికిత్స అందిస్తున్న వైద్యుడు, సంబంధిత జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, అలాగే చికిత్సతో సంబంధం లేని మరో ఇద్దరు సీనియర్ వైద్యులు సభ్యులుగా ఉంటారు. ఈ బోర్డు కూడా స్వతంత్రంగా రోగి పరిస్థితిని అంచనా వేసి తుది అభిప్రాయం వెల్లడిస్తుంది.
సంరక్షకుడి అంగీకారం.. మేజిస్ట్రేట్‌కు సమాచారం
కారుణ్య మరణం అమలుకు రెండు వైద్య బోర్డులు ఒకే అభిప్రాయానికి రావడం మాత్రమే కాకుండా, రోగి సంరక్షకుడి పూర్తి సమ్మతి కూడా తప్పనిసరిగా ఉండాలి. అనంతరం సంబంధిత ఆసుపత్రి చికిత్స నిలిపివేయడానికి ముందు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్‌కు అధికారికంగా సమాచారం ఇవ్వాలి. దీంతో మొత్తం ప్రక్రియ చట్టబద్ధంగా, పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
వైద్య బోర్డు నిరాకరిస్తే హైకోర్టును ఆశ్రయించవచ్చు
ఒకవేళ ద్వితీయ వైద్య బోర్డు చికిత్స నిలిపివేయడానికి అంగీకరించకపోతే, రోగి సంరక్షకుడు హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో హైకోర్టు 20 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన వైద్యులతో ప్రత్యేక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి కేసును మళ్లీ పరిశీలించవచ్చు. ఈ విధంగా రోగి కుటుంబానికి న్యాయపరమైన అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది.
మూడేళ్ల పాటు రికార్డుల భద్రపరిచే నిబంధన
కారుణ్య మరణానికి సంబంధించిన అన్ని పత్రాలు, వైద్య బోర్డుల నివేదికలు, సంరక్షకుడి అంగీకారం, ఇతర అధికారిక రికార్డులను కనీసం మూడు సంవత్సరాల పాటు భద్రపరచాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఏవైనా న్యాయపరమైన వివాదాలు తలెత్తితే వాటి పరిశీలనకు ఈ రికార్డులు ఉపయోగపడతాయి.
సుప్రీంకోర్టు తీర్పు అనంతర కీలక నిర్ణయం
భారతదేశంలో గౌరవప్రదంగా మరణించే హక్కు అంశంపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు, ఇటీవల జీవనాధార చికిత్స ఉపసంహరణకు సంబంధించిన మార్గదర్శకాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధివిధానాలను రూపొందించింది. దీంతో అంతిమ దశలో ఉన్న రోగుల చికిత్సపై వైద్యులు, కుటుంబ సభ్యులు, ఆసుపత్రులు అనుసరించాల్సిన స్పష్టమైన విధానం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి రానుంది.
