Let's talk: editor@tmv.in
ఆక్వా రైతులకు ఊరట: రొయ్యల ఫీడ్ ధరల నియంత్రణకు ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆక్వా రైతులకు ఊరట: రొయ్యల ఫీడ్ ధరల నియంత్రణకు ప్రభుత్వం కీలక నిర్ణయం

Gaddamidi Naveen
23 జూన్, 2026

ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా (రొయ్యల) రంగాన్ని బలోపేతం చేసేందుకు, రొయ్యల ఫీడ్ ధరలను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రొయ్యల ఫార్మ్ గేట్ ధరలను పర్యవేక్షించడంతో పాటు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఫీడ్ ధరలను అంచనా వేసి, ఎప్పటికప్పుడు 'సరైన ధర'ను నిర్ణయించడానికి ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.

మత్స్య శాఖ కమిషనర్ అధ్యక్షతన పనిచేసే ఈ కమిటీ.. ఫీడ్ తయారీకి అవసరమైన ముడి పదార్థాల ఖర్చులు, తయారీ ప్రక్రియ, రవాణా, మార్కెట్ పోకడలు, నాణ్యతా ప్రమాణాలు అన్ని రకాల పదార్థాల ధరల సూచీలను సమగ్రంగా పరిశీలిస్తుంది. కోళ్ల పెంపకం (పౌల్ట్రీ) రంగంలో అనుసరిస్తున్న విధానాల తరహాలోనే, ఇక్కడ కూడా సాంకేతిక సూత్రాలను వర్తింపజేస్తూ ఆక్వా రైతులకు, ఆక్వా ఫీడ్ మిల్లర్లకు మధ్య సమన్వయం కుదిర్చి సరైన ధరను ఖరారు చేస్తుందని పశుసంవర్ధక, డెయిరీ అభివృద్ధి, మత్స్య శాఖ ఎక్స్-అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ఒక ప్రభుత్వ ఉత్తర్వు లో పేర్కొన్నారు.

ఈ కమిటీ అంతర్జాతీయ ప్రమాణాలు, మార్కెట్ ఇంటెలిజెన్స్, డేటా వెరిఫికేషన్, నిపుణుల సలహాలు, పారదర్శకమైన మార్గదర్శకత్వం వంటి అంశాలపై దృష్టి సారిస్తుంది. దేశీయంగా ఇతర రాష్ట్రాలలో అంతర్జాతీయ మార్కెట్లలో రొయ్యల కొనుగోలు ధరలను ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సేకరించి విశ్లేషిస్తుంది. సైంటిఫిక్ నిపుణులు, ఎకనామెట్రీషియన్లు, పరిశోధనా సంస్థల సహకారంతో మార్కెట్ హెచ్చుతగ్గులను అంచనా వేస్తుంది. రొయ్యల కొనుగోలు ధరలకు సంబంధించిన డిజిటల్ అప్లికేషన్‌ను క్రమబద్ధీకరిస్తూ.. రైతులు నష్టపోకుండా ముందస్తు పంట ప్రణాళికలు వేసుకునేలా గణితశాస్త్ర ఆధారిత బేస్‌లైన్ ధరలను సిఫార్సు చేస్తుంది. యాంటీబయాటిక్స్ లేని నాణ్యమైన ఆక్వా ఉత్పత్తుల తయారీని పర్యవేక్షిస్తుంది. నేషనల్ రెసిడ్యూ కంట్రోల్ ప్లాన్ పరీక్షలు, గ్లోబల్ ఏజెన్సీ సర్టిఫికేషన్లను నిర్వహిస్తూ.. అంతర్జాతీయ గుర్తింపు పొందిన లేబిలింగ్‌తో ఎక్కువ లాభాలు తెచ్చే వాల్యూ-యాడెడ్ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తుంది.

దీనితో పాటు, రొయ్యల ఫీడ్ తయారీకి వాడే ముడిపదార్థాల ధరలను పర్యవేక్షించడానికి 'ఆంధ్రప్రదేశ్ ష్రింప్ ఫీడ్ ఇంగ్రీడియంట్స్ ప్రైస్ మానిటరింగ్ కమిటీ' అనే మరో కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు బి. రాజశేఖర్ తెలిపారు. సాంకేతిక సంస్థలు, ఆక్వా రంగ భాగస్వాములతో కూడిన ఈ కమిటీ జాతీయ స్థాయిలో లభించే ఫీడ్ పదార్థాల ధరల డేటాను విశ్లేషిస్తుంది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఫిష్ మీల్ (చేపల పొడి), సోయాబీన్ ధరల హెచ్చుతగ్గులను, ఇతర ఫీడ్ పదార్థాల దిగుమతులు, ఎగుమతులను నిరంతరం పర్యవేక్షిస్తూ, క్రమాలానుగతంగా ఫీడ్ ధరలను సమీక్షిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆక్వా రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గి, మార్కెట్లో స్థిరత్వం లభిస్తుందని భావిస్తున్నారు.

ట్యాగ్‌లు
AndhraPradeshAquacultureShrimpFarmingAquaFarmersShrimpFeedFeedPricesAPGovtFisheriesDepartmentSeafoodIndustryAquaSector
ఆక్వా రైతులకు ఊరట: రొయ్యల ఫీడ్ ధరల నియంత్రణకు ప్రభుత్వం కీలక నిర్ణయం - Tholi Paluku