
రిటైర్డ్ ఉద్యోగుల రూ.1,000 కోట్ల బకాయిలు విడుదల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బకాయిల కోసం రూ.1,000 కోట్లను బుధవారం విడుదల చేసింది. ఆర్థిక శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ డిప్యూటీ సీఎం ఈ నిధులను విడుదల చేయించడం గమనార్హం.
గత ఏడాది ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా ప్రతి నెలా రూ.700 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ మేరకు మార్చి 2026 వరకు నిరంతరాయంగా నిధులు విడుదల చేస్తూ తన నిబద్ధతను చాటుకుంది. అయితే, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను గమనించిన భట్టి విక్రమార్క, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నెలవారీ కేటాయింపును రూ.700 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ నెలకు సంబంధించిన రూ.1,000 కోట్లను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేశారు.
రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందించింది. తాజా నిధులతో అక్టోబర్ 2025 వరకు పెండింగ్‌లో ఉన్న అన్ని జీపీఎఫ్ (జనరల్ ప్రావిడెంట్ ఫండ్) బకాయిలను పూర్తిగా క్లియర్ చేసింది. తమ పదవీ విరమణ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఇది గొప్ప ఉపశమనం కలిగించనుంది. ఉద్యోగుల ఆరోగ్య అవసరాల విషయంలో ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా ప్రాధాన్యత క్రమంలో మెడికల్ బిల్లులు చెల్లించాలని అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం వైద్య బిల్లులతో పాటు స్కాలర్‌షిప్ చెల్లింపులు కూడా అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని ప్రభుత్వం పేర్కొన్నారు.
ఉద్యోగులు పాలనలో భాగస్వాములు వారి సమస్యలను పరిష్కరించడం మా బాధ్యత అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. పెరిగిన నిధుల కేటాయింపు, జీపీఎఫ్ బకాయిల క్లియరెన్స్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని సీనియర్ అధికారులు తెలిపారు. డిప్యూటీ సీఎం చొరవతో భారీ స్థాయిలో నిధులు విడుదల కావడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
