Let's talk: editor@tmv.in
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ సరైనదే: ఎన్. రామ‌చందర్ రావు

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ సరైనదే: ఎన్. రామ‌చందర్ రావు

Gaddamidi Naveen
11 జూన్, 2026

ప్రజాప్రతినిధులుగా పోటీ చేసే అభ్యర్థులు తమపై ఉన్న కేసులు, ఆస్తుల వివరాలను ఖచ్చితంగా వెల్లడించాలని, అయితే కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిని మీనాక్షి నటరాజన్ తనపై ఉన్న ఒక కేసు వివరాలను తెలిసికూడా అఫిడవిట్‌లో దాచారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ‌చందర్ రావు బుధవారం ఆరోపించారు. మీనాక్షి నటరాజన్ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.

మధ్యప్రదేశ్‌లోని మూడు రాజ్యసభ స్థానాలకు జూన్ 18న జరగబోయే ఎన్నికల ప్రక్రియ మంగళవారం నాటకీయ మలుపు తిరిగింది. మీనాక్షి నటరాజన్ సమర్పించిన నామినేషన్ అఫిడవిట్‌లో సమాచారాన్ని దాచారనే కారణంతో ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీనిపై రామ‌చందర్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం తన వద్ద ఉన్న ఆధారాల బేస్ మీదనే ఈ నిర్ణయం తీసుకుందని, ఇందులో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

కేసు గురించి తెలిసి కూడా దాచారు..

సీనియర్ న్యాయవాది కూడా అయిన రామ‌చందర్ రావు చట్టపరమైన నిబంధనలను గుర్తుచేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ కేసులు, ఆస్తుల వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలనేది సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశం. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు. తనపై ఉన్న కేసు గురించి మీనాక్షి నటరాజన్ కి తెలియదా? ఆమె ఇప్పటికే సంబంధిత కోర్టులో కౌంటర్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అంటే ఆ కేసు గురించి ఆమెకు పూర్తి అవగాహన ఉంది. అయినప్పటికీ ఫామ్-26 అఫిడవిట్‌లో ఆ కోర్టు ఫిర్యాదును పేర్కొనకుండా తప్పుడు సమాచారం ఇచ్చారు. అలాంటప్పుడు నామినేషన్ తిరస్కరణకు గురికావడం సహజం అని ఆయన పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు

గోదావరి నదిపై అంతరాష్ట్ర సరిహద్దులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన బ్యారేజీ ఎత్తుపై చర్చించడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తనకు సమయం ఇవ్వడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను రామ‌చందర్ రావు తోసిపుచ్చారు. రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోసం నిజాయితీగా ప్రయత్నించడం లేదని ఆరోపించారు. మహారాష్ట్ర సీఎం, తెలంగాణ సీఎంకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదనడం సరికాదు. దేవేంద్ర ఫడ్నవీస్ మానవీయ కోణం ఉన్న నాయకుడు, ఎవరినీ అవమానించరు. రేవంత్ రెడ్డికి నిజంగా ఆసక్తి ఉంటే నేనే ఆయన్ను మహారాష్ట్ర సీఎం వద్దకు తీసుకెళ్తాను అని సవాల్ విసిరారు. మాజీ సీఎం కేసీఆర్ లాగే రేవంత్ రెడ్డి కూడా త్వరలోనే అదే రాజకీయ పతనాన్ని చూస్తారని ఆయన హెచ్చరించారు.

మోడీ ప్రభుత్వ ఘనతలు.. తెలంగాణకు నిధులు

వరుసగా అత్యంత సుదీర్ఘకాలం సేవాలందించిన ప్రజాస్వామ్య ప్రధానిగా నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు సృష్టించిన సందర్భాన్ని రామ‌చందర్ రావు ప్రస్తావించారు. మోడీ నాయకత్వంలో దేశం వివిధ రంగాలలో ఆత్మనిర్భర్ దిశగా పయనిస్తోందన్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం రూ. 13 లక్షల కోట్ల నిధులను అందించిందని ఆయన గుర్తుచేశారు. పహల్గామ్ వంటి ఉగ్రదాడులు జరిగినప్పుడు మోడీ ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుందని, దీనివల్ల అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ట పెరిగిందన్నారు. పాత వలసరాజ్యాల ఆలోచనా విధానాన్ని మార్చి, మోడీ నాయకత్వంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ‘నవ భారతం’ దూసుకుపోతోందని ఆయన కొనియాడారు.