Let's talk: editor@tmv.in
హైదరాబాద్–తిరుపతి విమాన చార్జీలు తగ్గించండి..కేంద్రానికి ఎంపీ గురుమూర్తి లేఖ

హైదరాబాద్–తిరుపతి విమాన చార్జీలు తగ్గించండి..కేంద్రానికి ఎంపీ గురుమూర్తి లేఖ

Panthagani Anusha
15 ఏప్రిల్, 2026

హైదరాబాద్-తిరుపతి విమాన మార్గంలో చార్జీలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే తిరుపతికి విమాన టికెట్ల ధరలు అసాధారణంగా పెరగడంపై తిరుపతి ఎంపీ ఎం. గురుమూర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విమానయాన సంస్థల దోపిడీని అరికట్టి చార్జీలను నియంత్రించేలా తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ఆయన సోమవారం లేఖ రాశారు.

మెట్రో నగరాల కంటే తిరుపతికే అధికం

దేశంలోని ప్రముఖ మెట్రో నగరాల మధ్య ఉన్న విమాన చార్జీల కంటే తిరుపతి మార్గంలోనే ధరలు ఎక్కువగా ఉన్నాయని ఎంపీ ఈ సందర్భంగా గణాంకాలతో వివరించారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు సాధారణంగా టికెట్ ధర రూ. 2,500 నుంచి రూ. 7,000 మధ్యలో ఉంటుండగా కేవలం గంట ప్రయాణం ఉండే తిరుపతికి మాత్రం రూ. 6,600 నుంచి రూ. 9,500 వరకు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. రద్దీ సమయాల్లో ఈ ధర ఏకంగా రూ. 14,500 కి చేరుతోందని ఇది భక్తులపై మోయలేని భారమని పేర్కొన్నారు.

పెరిగిన రద్దీ.. తగ్గిన సీట్ల సామర్థ్యం

ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతున్నప్పటికీ, విమానయాన సంస్థలు సీట్ల లభ్యతను తగ్గించడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని ఎంపీ విశ్లేషించారు. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు సుమారు 11.8 లక్షల మంది ప్రయాణికులు ఈ మార్గంలో ప్రయాణించారని కేవలం గత మార్చి నెలలోనే 88,405 మంది రాకపోకలు సాగించారని తెలిపారు. రోజుకు సగటున 17 విమానాలు నడుస్తున్నప్పటికీ గతంలో ఉన్న ఐదు పెద్ద విమానాల స్థానంలో ప్రస్తుతం కేవలం రెండు మాత్రమే నడుస్తున్నాయని మిగిలినవన్నీ తక్కువ సీట్ల సామర్థ్యం గల చిన్న విమానాలు కావడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడి ధరలు పెరుగుతున్నాయని వివరించారు.

'ఉడాన్' లక్ష్యాలకు తూట్లు

సామాన్యుడికి కూడా విమాన ప్రయాణాన్ని చేరువ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉడాన్' పథకం ఆశయాలకు ఈ ధరల పెరుగుదల గొడ్డలిపెట్టులా మారిందని గురుమూర్తి విమర్శించారు. తిరుపతి వంటి అంతర్జాతీయ పుణ్యక్షేత్రానికి వచ్చే వృద్ధులు, మధ్యతరగతి భక్తుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకోవాలని కోరారు.

విమాన చార్జీలను సముచిత స్థాయిలో ఉంచేలా విమానయాన సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర మంత్రిని ఎంపీ కోరారు. పీక్ సమయాల్లో అధిక ధరలను నియంత్రించాలని ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తిరుపతి మార్గంలో పెద్ద సామర్థ్యం గల విమానాలను తిరిగి ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.