Let's talk: editor@tmv.in
రికార్డు స్థాయిలో వరి సాగు.. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

రికార్డు స్థాయిలో వరి సాగు.. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Panthagani Anusha
15 మే, 2026

తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత యాసంగి సీజన్‌లో రైతాంగం రికార్డు స్థాయిలో వరి ధాన్యాన్ని పండించిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వం పూర్తి మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. ఖమ్మం జిల్లా పాలేరులో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్‌తో కలిసి ఆయన గురువారం సందర్శించారు.

క్షేత్రస్థాయిలో సమస్యల పరిశీలన - అధికారులకు ఆదేశాలు

ధాన్యం కొనుగోలు కేంద్రంలో సేకరణ ప్రక్రియ మద్దతు ధర అమలు తూకంలో పారదర్శకత, గోనె సంచుల లభ్యతపై మంత్రి పొంగులేటి నేరుగా రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే మిల్లులకు తరలించేలా లారీల సంఖ్యను పెంచాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా ఎదురవుతున్న లారీల కొరతను అధిగమించేందుకు అవసరమైతే ఇతర అవసరాలకు వాడే డీసీఎంలు, వాహనాలను కూడా ధాన్యం రవాణాకు మళ్లించాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మిల్లర్ల అక్రమాలపై ఉక్కుపాదం

ధాన్యం సేకరణలో తాలు, చెత్త పేరుతో రైతులను ఇబ్బంది పెట్టే మిల్లర్లు ఏజెన్సీలపై మంత్రి హెచ్చరికలు జారీ చేశారు. క్వింటాలుకు 5 నుంచి 6 కేజీల వరకు ధాన్యం కోత విధిస్తే ఊరుకునేది లేదని అటువంటి మిల్లులను తక్షణమే సీజ్ చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా లారీలను సరఫరా చేసే ఏజెన్సీలు రైతుల వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే అధికారులు అప్రమత్తంగా ఉండి వెంటనే పరిష్కరించాలని సూచించారు.

ప్రతిపక్షాల విమర్శలపై ఘాటు స్పందన

రైతు పక్షపాతిగా ఉన్న ప్రజా ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ విమర్శలు చేయడం సిగ్గుచేటని పొంగులేటి ధ్వజమెత్తారు. "గత ప్రభుత్వ హయాంలో ధాన్యం సేకరణ నిర్ణయం తీసుకోవడానికే ఏప్రిల్ చివరి దాకా పట్టేది. ఖమ్మంలో రైతుల చేతులకు సంకెళ్లు వేసి జైల్లో పెట్టిన చరిత్ర వారిది. గత పదేళ్లలో రైతులకు వారు ఏం చేశారో ఆత్మ పరిశీలన చేసుకోవాలి" అని విమర్శించారు. గత ప్రభుత్వం "వరి వేస్తే ఉరి" అన్న ధోరణిలో ఉంటే తమ ప్రభుత్వం వరి సాగును ప్రోత్సహిస్తూ మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు బోనస్ కూడా ఇస్తోందని గుర్తు చేశారు.

రూ. 22 వేల కోట్లతో బృహత్తర సేకరణ

ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో ఈ యాసంగిలో సుమారు 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని రూ. 22 వేల కోట్లతో కొనుగోలు చేయబోతోందని మంత్రి వివరించారు. దేశ చరిత్రలోనే ఇది అత్యధిక ధాన్య సేకరణ అని రైతులు ప్రతిపక్షాల తప్పుడు మాటలను నమ్మవద్దని కోరారు. అనంతరం జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రులతో పాటు ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యేలు సాంబశివరావు, రాందాస్ నాయక్, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు అధికారులు పాల్గొన్నారు.