
తిరుమల లడ్డూల విక్రయంలో రికార్డు.. జూన్‌లో 1.26 కోట్ల విక్రయం
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రికార్డు సృష్టించింది. జూన్ 2026 నెలలో అత్యధికంగా 1.26 కోట్ల లడ్డూలను విక్రయించినట్లు టీటీడీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది 6 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది.
తిరుమలకు భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో లడ్డూల తయారీని టీటీడీ గణనీయంగా పెంచింది. ఉత్పత్తి, పంపిణీ ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎక్కడా కొరత లేకుండా భక్తులకు లడ్డూలను అందిస్తున్నట్లు తెలిపింది.
గతేడాది జూన్ నెలతో పోలిస్తే ఈసారి అదనంగా 7.5 లక్షల లడ్డూలు ఎక్కువగా అమ్ముడయ్యాయి. ఇది 6.37 శాతం వృద్ధిని సూచిస్తుంది. రెండేళ్ల క్రితం (జూన్ 2024) తో పోలిస్తే ఈసారి 24 లక్షల లడ్డూలు అదనంగా విక్రయించబడ్డాయి. అంటే ఏకంగా 23.5 శాతం భారీ వృద్ధి నమోదైంది. ఏప్రిల్ 2026లో 1.1 కోట్లకు పైగా, మే 2026లో 1.2 కోట్లకు పైగా లడ్డూలను విక్రయించగా.. జూన్‌లో అది రికార్డు స్థాయిలో 1.26 కోట్ల విక్రయించినట్లు టీటీడీ పేర్కొంది.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య నిరంతరం పెరుగుతున్నప్పటికీ.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ప్రసాదాన్ని అందించేందుకు లడ్డూల ఉత్పత్తి, పంపిణీని ముందస్తు ప్రణాళికతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది.
