
తెలంగాణలో రికార్డు స్థాయలో ధాన్యం సేకరణ...ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను రాష్ట్ర ప్రభుత్వం తిప్పికొట్టింది. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత యాసంగి సీజన్‌లో స్వాతంత్ర౦ వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 65 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందని, మొత్తం 141 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత సీజన్‌లో ప్రభుత్వం 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుందని, ఇందులో 52 లక్షల మెట్రిక్ టన్నులను కేంద్ర ప్రభుత్వం సేకరిస్తుందని మంత్రి వివరించారు. ఇప్పటివరకు 17.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని, రైతులకు మద్దతు ధర కింద రూ. 2,010 కోట్లు విడుదల చేశామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గరిష్ట సాగు విస్తీర్ణం, రికార్డు స్థాయి ఉత్పత్తి నమోదైందని, బీఆర్ఎస్ నేతలు కావాలనే తప్పుడు ప్రచారంతో రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు.
అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా ఉండేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు పని చేస్తున్నాయని, ధాన్యం రక్షణ కోసం 2.63 లక్షల టార్పాలిన్లు, 18.50 కోట్ల గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ఎండ తీవ్రత దృత్యా కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీడ సదుపాయం కల్పించామని పేర్కొన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లోనే సేకరణ ప్రక్రియ కొనసాగించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. పిడుగుపాట్ల వల్ల రైతులు ఎవరైనా మరణిస్తే ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మెరుగైన సేవలు అందిస్తోందని మంత్రి గణాంకాలతో వివరించారు. 2023-24 ఖరీఫ్ సీజన్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 10,415 కోట్లు చెల్లించగా, 2024-25 ఖరీఫ్ సీజన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 12,512 కోట్లు చెల్లించిందని ఆయన గుర్తు చేశారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ధాన్యం సేకరణపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం లేదని, పారదర్శకంగా కొనుగోళ్లు జరుగుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు.
అయితే, ఇదే సమయంలో ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వంపై విమర్శల దాడిని ఉధృతం చేశాయి. వరంగల్‌లో జరిగిన 'రైతు సంగ్రామ సభ'లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు పోరాడుతామని హెచ్చరించారు. అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పందిస్తూ, అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతున్నారని, యుద్ధ ప్రాతిపదికన ధాన్యం సేకరించాలని డిమాండ్ చేశారు. ఎండలు, వడగళ్ల వానలతో రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని బీజేపీ ఆరోపించింది.
