Let's talk: editor@tmv.in
రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి దర్శనం

రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి దర్శనం

Panthagani Anusha
4 మే, 2026

వేసవి సెలవులకు వారాంతపు రద్దీ తోడవడంతో తిరుమల గిరులు భక్తజన సంద్రమయ్యాయి. ఎన్నడూ లేని విధంగా మే 2వ తేదీన రికార్డు స్థాయిలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు వెల్లడించారు. ఒక్క శనివారం రోజే 91,005 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 36,257 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సేవలను మరింత మెరుగుపరుస్తున్నామని చైర్మన్ బి.ఆర్. నాయుడు స్పష్టం చేశారు. కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండి పర్యవేక్షిస్తోందని ఆయన తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

కాగా క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే భక్తుల కోసం టీటీడీ సిబ్బంది మరియు శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా అన్నప్రసాదాలు, పాలు, మజ్జిగ, మరియు చల్లని మంచినీటిని అందజేస్తున్నామని చైర్మన్ వివరించారు. భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలను సమృద్ధిగా కల్పిస్తున్నామని, దర్శన సమయం మరియు ఇతర వివరాలను ఎప్పటికప్పుడు సమాచార వ్యవస్థ ద్వారా భక్తులకు తెలియజేస్తున్నామని ఆయన వెల్లడించారు.

మరోవైపు భక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ, శ్రీవారి లడ్డూ ప్రసాదాల విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకున్నామని బి.ఆర్. నాయుడు భరోసా ఇచ్చారు. లడ్డూ ప్రసాదాలు లోటు లేకుండా నిరంతరం భక్తులకు అందుబాటులో ఉంచుతున్నామని రద్దీకి అనుగుణంగా యంత్రాంగాన్ని సిద్ధం చేసినట్లు ఆయన ఈ సందర్భంగా ఒక ప్రకటనలో తెలిపారు.