
పవన్ కళ్యాణ్ చొరవతో వర్తనపల్లి శివాలయ పునర్నిర్మాణం
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గంలోని మారుమూల గిరిజన గ్రామం వర్తనపల్లిలో దశాబ్దాలుగా శిథిలావస్థలో ఉన్న శివాలయ పునర్నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో ఈ ఆలయ పునరుద్ధరణ పనుల నిమిత్తం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ. 55 లక్షల నిధులను మంజూరు చేసింది
గత నెల మార్చి 14న పాడేరు పర్యటనలో భాగంగా వర్తనపల్లి గ్రామాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్, స్థానికుల అభ్యర్థన మేరకు శివాలయాన్ని దర్శించారు. మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయం శిథిలావస్థకు చేరడాన్ని గమనించిన ఆయన పునర్నిర్మాణానికి అవసరమైన సహకారం అందిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. పర్యటన ముగిసిన వెంటనే టీటీడీకి లేఖ రాసి భక్తుల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ఆలయ అభివృద్ధి చర్యలు చేపట్టాలని కోరారు.
ఇక ఈ విషయమై స్పందించిన టీటీడీ పాలకమండలి, రూ.55 లక్షల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం టీటీడీ సాంకేతిక బృందం గ్రామంలో పర్యటించి ఆలయ పునర్నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులకు అంచనాలు సిద్ధం చేసింది.
కాగా పునర్నిర్మాణ పనుల్లో భాగంగా శివాలయంతో పాటు సింహవాహనంతో అమ్మవారి విగ్రహం, మూషిక వాహనంతో గణపతి విగ్రహం, నెమలి వాహనంతో సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. అదనంగా ధ్వజస్తంభం, భక్తుల కోసం బెంచీలు, బోర్‌వెల్ ద్వారా తాగునీటి సౌకర్యం, మైక్ వ్యవస్థ వంటి మౌలిక వసతులు కూడా కల్పించనున్నారు.
ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణానికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీటీడీ పాలక మండలి ఛైర్మన్ బి.ఆర్.నాయుడు సభ్యులు అధికారులకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
