Let's talk: editor@tmv.in
పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు

పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు

Gaddamidi Naveen
18 మే, 2026

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేశవరావు నేతృత్వంలో కమిటీ తొలి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యమకారుల గుర్తింపు కోసం అధికారిక కమిటీని ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కమిటీ ధన్యవాదాలు తెలిపింది. అమరవీరుల జ్యోతి కింద ఉన్న కార్యాలయంలోనే ఈ కమిటీ ఆఫీస్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

అలాగే అమరవీరుల గుర్తింపు అంశంపై త్వరలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి వారి సూచనలు, ప్రతిపాదనలు స్వీకరించాలని కమిటీ నిర్ణయించింది. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ, 1969 ఉద్యమకారులు, ఉద్యోగ సంఘాలు, కళాకారుల జేఏసీ, సబ్బండ వర్గాల జేఏసీలు, కుల సంఘాలు, న్యాయవాదుల జేఏసీలు, వివిధ జిల్లాల్లోని ఉద్యమ సంఘాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు.

ఉద్యమకారుల గుర్తింపునకు 4 వర్గాలుగా...

ఉద్యమకారుల గుర్తింపుకు నాలుగు వర్గాలుగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి తొలి ప్రాధాన్యం, గాయపడిన వారికి రెండో వర్గం, జైలుకు వెళ్లిన వారు, అరెస్టులు ఎదుర్కొన్న వారు, కేసులు ఎదుర్కొన్న వారిని మూడో వర్గంగా గుర్తించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఉద్యమంలో పనిచేసిన వారిని నాలుగో వర్గంగా పరిగణించి, వారి సేవలకు సంబంధించిన పత్రికా కటింగ్స్ ఆధారంగా గుర్తించాలని ప్రతిపాదించారు.

గత ప్రభుత్వంలో కొంతమందికే సహాయం అందిందని, ఈసారి అలాంటి పరిస్థితి లేకుండా పారదర్శకంగా ఎంపిక చేస్తామని కమిటీ స్పష్టం చేసింది. 1969, 1972, 1996 నాటి ఉద్యమకారులతో పాటు పౌరసమాజం, జేఏసీలు, ఉద్యోగ, కళాకారుల, కుల, న్యాయవాదుల సంఘాల నుంచి ప్రతిపాదనలు సేకరించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ పర్యటన ముగించుకుని రాగానే, కమిటీ ప్రతిపాదించిన ఈ కీలక అంశాలపై ఆయనతో చర్చించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు చైర్మన్ కేశవరావు వెల్లడించారు.