

దక్షిణాది ప్రయోజనాలను దెబ్బతీస్తే తిరుగుబాటు తప్పదు: కేటీఆర్
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. పీర్జాదిగూడలో జరిగిన సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ, దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించే ఏ ప్రయత్నాన్నైనా ప్రాణాలకు తెగించి అడ్డుకుంటామని హెచ్చరించారు.
మహిళా రిజర్వేషన్లపై చిత్తశుద్ధి
మహిళా రిజర్వేషన్లకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, అయితే దీనిని నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్)తో ముడిపెట్టడం వెనుక కేంద్రం కుట్ర దాగి ఉందని కేటీఆర్ ఆరోపించారు. మహిళా సాధికారత కోసం తమ పార్టీ ఎప్పటి నుంచో కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 50 శాతం, మార్కెట్ కమిటీల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేసి ఆదర్శంగా నిలిచిందని గుర్తుచేశారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు చేసినట్లు తెలిపారు. మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయండి. పార్లమెంటులో ఉన్న 543 సీట్లలోనే దీనిని వర్తింపజేయవచ్చు కదా? పునర్విభజనతో ముడిపెట్టి ఎందుకు కాలయాపన చేస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో కూడా అదే విధంగా అమలు చేయవచ్చని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సంక్లిష్టం చేస్తోందని విమర్శించారు.
దక్షిణాది ప్రాతినిధ్యంపై పోరాటం
రాజ్యాంగ ప్రక్రియలను గౌరవించాల్సిన అవసరాన్ని కూడా కేటీఆర్ ప్రస్తావించారు. ముందుగా జనగణన నిర్వహించి, తరువాత నియోజకవర్గాల పునర్విభజన చేసి, ఆ తర్వాతే నిర్మాణాత్మక మార్పులు చేపట్టాలని స్పష్టం చేశారు. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం శిక్షించాలనుకోవడం అన్యాయమని కేటీఆర్ మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలగని ప్రతిపాదనలకు తమ మద్దతు ఉంటుందని, కానీ అన్యాయం జరిగితే ఆందోళనలు చేపట్టడానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం సుమారు 24 శాతం ఉందని, ఈ శాతం ఏ పరిస్థితుల్లోనూ తగ్గకూడదని కేటీఆర్ అన్నారు. స్వల్పంగా అయినా తగ్గింపును అంగీకరించబోమని చెప్పారు. 1971లో అమలులోకి వచ్చిన సీట్ల స్తంభన జనాభా నియంత్రణ విధానాల ఆధారంగా జరిగిందని, దక్షిణాది రాష్ట్రాలు ఈ విధానాలను కట్టుదిట్టంగా అమలు చేశాయని గుర్తుచేశారు. జాతీయ జనాభా విధానాన్ని పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య తగ్గించి, ఉత్తరాది రాష్ట్రాలకు పెంచడం వల్ల సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది ఆత్మగౌరవంతో ఆడుకుంటే తీవ్రమైన తిరుగుబాటు వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి ఒక హైబ్రిడ్ ముఖ్యమంత్రి
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయనను “హైబ్రిడ్ ముఖ్యమంత్రి”గా అభివర్ణిస్తూ, రాజకీయ వైఖరిలో స్థిరత్వం లేదని ఆరోపించారు. ఉదయం కాంగ్రెస్ తరఫున మాట్లాడి, సాయంత్రానికి బీజేపీతో కలిసిపోతారని వ్యాఖ్యానించారు. ఈ ద్వంద్వ ధోరణి పాలనలో కూడా కనిపిస్తోందని అన్నారు. హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రతిపాదనపై కూడా కేటీఆర్ ప్రశ్నలు లేవనెత్తారు. ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని పేర్కొన్నారు. ఒకే విషయంలో వేర్వేరు ప్రమాణాలు అనుసరించడం తగదని, కాంగ్రెస్ పార్టీ స్పష్టతతో వ్యవహరించాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం కేవలం రాజకీయ సమీకరణాల మీద కాకుండా, పాలన, ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని కేటీఆర్ సూచించారు. దక్షిణాదికి అన్యాయం జరిగితే ఇతర ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి పోరాడుతామని ఆయన ప్రకటించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులో ఉన్న అస్పష్టతలను తొలగించి, స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
